T20 Blast: Shaheen Afridi Creates World Record, Took 4 Wickets In 1st Over - Sakshi
Sakshi News home page

T20 Blast: చరిత్ర సృష్టించిన షాహీన్‌ అఫ్రిది.. పొట్టి క్రికెట్‌లో తొలి బౌలర్‌గా రికార్డు

Published Sat, Jul 1 2023 10:30 AM | Last Updated on Sat, Jul 1 2023 10:40 AM

T20 Blast: Shaheen Afridi Creates World Record, First To Take 4 Wickets In 1st Over - Sakshi

టీ20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్‌షైర్‌తో నిన్న (జూన్‌ 30) జరిగిన మ్యాచ్‌లో నాటింగ్‌హమ్‌ ఆటగాడు, పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు గోల్డెన్‌ డకౌట్‌లు (తొలి బంతికే ఔట్‌) ఉన్నాయి. ఫలితంగా వార్విక్‌షైర్‌ తొలి ఓవర్‌లో 7 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

వార్విక్‌షైర్‌ ఖాతాలో ఉన్న 7 పరుగుల్లో 5 వైడ్ల రూపంలో వచ్చినవి కావడం విశేషం. తొలి బంతి​కి వైడ్ల రూపంలో 5 పరుగులు రాగా.. ఆతర్వాతి బంతికి అలెక్స్‌ డేవిస్‌ (0) ఎల్బీడబ్ల్యూ, రెండో బంతికి బెంజమిన్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారు. 3, 4 బంతులకు సింగల్స్‌ రాగా.. ఐదో బంతికి మౌస్లే (1).. ఓలీ స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి బంతికి బర్నార్డ్‌ (0) క్లీన్‌ బౌల్డయ్యాడు. 

ఇలా షాహీన్‌ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో ఇద్దరిని క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో పాటు మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఓ బౌలర్‌ ఈ తరహాలో తొలి ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. వన్డేల్లో శ్రీలంక పేస్‌ దిగ్గజం చమిందా వాస్‌ ఈ ఘనత సాధించాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాస్‌.. తొలి ఓవర్‌లో హ్యాట్రిక్‌తో పాటు 4 వికెట్లు పడగొట్టాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నాటింగ్‌హమ్‌.. నిర్ణీత ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. లింటాట్‌, హసన్‌ అలీ తలో 3 వికెట్లు, మ్యాక్స్‌వెల్‌ 2, బ్రూక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టగా.. నాటింగ్‌హమ్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ మూర్స్‌ (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో షాహీన్‌ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లోనే 4 వికెట్లు కోల్పోయిన వార్విక్‌షైర్‌.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాబర్ట్‌ ఏట్స్‌ (65), జేకబ్‌ బెథెల్‌ (27), జేక్‌ లింటాట్‌ (27 నాటౌట్‌) రాణించారు. నాటింగ్‌హమ్‌ బౌలర్లలో అఫ్రిది 4, జేక్‌ బాల్‌ 3 వికెట్లు పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement