T20 World Cup 2022 Ind Vs Pak: Virat Kohli Opens Up On His Relationship With MS Dhoni - Sakshi
Sakshi News home page

Kohli-MS Dhoni: కెరీర్‌ ఆరంభంలో కావాల్సినంత సపోర్ట్‌ ఇచ్చాడు

Published Sun, Oct 23 2022 1:34 PM | Last Updated on Sun, Oct 23 2022 6:10 PM

T20 WC: MS Dhoni Provides Required Support For My Growth My-Early Days - Sakshi

మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనితో విరాట్‌ కోహ్లికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా 2007లో టి20 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కోహ్లి జట్టులో లేడు. కానీ 2011 వన్డే వరల్డ్‌కప్‌ సాధించినప్పుడు కోహ్లి అప్పుడప్పుడే జట్టులో కీలకంగా ఎదుగుతున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నది ఎంఎస్‌ ధోనినే.

ఆ తర్వాతి కాలంలో ధోనితో కోహ్లికి ఎంతటి సాన్నిహిత్యం ఏర్పడిందనేది అందరికి తెలిసిందే. ధోని కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత తాను బాధ్యతలు తీసుకొని జట్టును విజయవంతంగా నడిపించాడు. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్‌ ఆటగాడిగా ఉన్న కోహ్లి మరో టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఐసీసీ పాడ్‌కాస్ట్‌ రివ్యూలో కోహ్లి మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే ధోనితో తనకున్న అనుబంధాన్ని కోహ్లి గుర్తుచేసుకున్నాడు.

''ధోనితో నా స్నేహాన్ని, బంధాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. అర్థం చేసుకోవడం, నమ్మకం మీద అది ఆధారపడి ఉంది. ఇద్దరం క్రీజ్‌లో ఉన్నప్పుడు బంతి గ్యాప్‌లోకి వెళ్తే.. ధోనీ నాతో చెప్పకుండానే రెండో పరుగు కోసం పరిగెత్తుతాడు. అతడు పరిగెత్తుతాడని నాకు.. నేను పరిగెడతానని ధోనీకి తెలుసు.జట్టు కోసం ఏం చేయాలో మేమిద్దరం అదే చేశాం.ఆటలోనే కాదు.. బయట కూడా మా ఇద్దరి మధ్య నమ్మకం,విశ్వాసం ఉన్నాయి. మేం అనేక విషయాలు మాట్లాడుకునే వాళ్లం. ఒకరి మైండ్‌సైట్‌ను మరొకరం అర్థం చేసుకున్నాం.కెరీర్ తొలి నాళ్లలో ధోనీ నాకెంతో అండగా నిలిచాడు.

ధోనీ కెరీర్ చివరి రోజుల్లో నేను అతడికి మద్దతుగా నిలిచాను. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పుడు.. బయటి వాళ్లకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదని అనిపించింది. కానీ మాకు మాత్రం అదెంతో సాధారణమైన విషయం. కెప్టెన్ నేనా లేదా ధోనీనా అనేది ఎప్పుడూ పట్టించుకోలేదు. ధోనీని ఎప్పుడూ నేను ఒకేలా చూశాను. కెప్టెన్‌గా ధోనీ, వైస్ కెప్టెన్‌గా నేను ఆటను నిశితంగా పరిశీలించేవాళ్లం. నాపై మహీ ఎంతో నమ్మకం ఉంచేవాడు.

నేను కెప్టెన్ అయ్యాక కూడా ధోనీ సలహాలు తీసుకున్న సందర్భాలు అనేకం. కెప్టెన్ ఎవరు.. జట్టును ముందుకు నడిపేది ఎవరూ అనేది మా మధ్య విషయం కాదు. మా మధ్య సహజమైన అనుబంధం ఉంది. ఇది నాకు జీవితం ఆనందాన్నిచ్చే విషయం'' అంటూ పేర్కొ‍న్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement