వరల్డ్‌కప్ 2012 చాంపియన్స్ విండీస్(PC: AP)- 2022 రన్నరప్ పాకిస్తాన్ (PC: PCB)
T20 World Cup: 2012 Winner West Indies- 2022 Winner England: వరల్డ్‌కప్ ఫైనల్ ఈసారి ‘టై’ కాలేదు... సూపర్ ఓవర్లు కూడా సమం కాలేదు... క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి, సగం గెలుపు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడానికి ఇంగ్లండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి చర్చే రాకుండా అద్భుత ఆటతో అందరికంటే శిఖరాన నిలిచింది. టోర్నీ ఆరంభంలో వర్షం తమ అవకాశాలను దెబ్బకొట్టినా, ఒక్కసారిగా పుంజుకొని మ్యాచ్‌లు వానపాలైన వేదికపైనే విశ్వ విజేతగా ఆవిర్భవించింది.
వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు రెండూ ఒకే సమయంలో తమ వద్ద కలిగి ఉన్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ గెలిచినా వివాదం వెంట తీసుకొచ్చి
ఆనందం కాస్త మసకబారగా... అంతకుముందే ఆరేళ్ల క్రితం టి20 వరల్డ్‌కప్ ఆఖరి మెట్టుపై అనూహ్య రీతిలో ఓడింది. వాటిని మరిచేలా తాజా విజయం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చూపించింది.
వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు... తొలుత బ్యాటింగ్ చేస్తూ.. పాకిస్తాన్ చూపిన పేలవ బ్యాటింగ్ ఇది... టి20ల్లో చివరి నాలుగు ఓవర్లంటే బౌలర్లకు డెత్ ఓవర్లు! కానీ పాక్ దానిని రివర్స్‌గా మార్చింది. ఆఖరి 4 ఓవర్లలో కనీసం 40 పరుగులు చేస్తే విజయంపై ఆశలు ఉంచుకోగలిగే చోట 18 పరుగులకే పరిమితమైంది. ముగింపు స్కోరుతోనే పాక్ ఓటమికి పునాది పడింది. టోర్నీ ఆసాంతం చెలరేగిన స్యామ్ కరన్ బౌలింగ్ పదును ముందు పాక్ తేలిపోయింది.
2012 ఫైనల్లో కూడా విండీస్ 137 పరుగులే చేసి విజేతగా నిలిచిన తీరు గుర్తుకొచ్చిందేమో... పాక్‌లో కాస్త ఆశలు పెరిగాయి! పైగా తొలి ఓవర్లోనే హేల్స్ అవుట్ కావడం, మెల్‌బోర్న్ మైదానం మొత్తం హోరెత్తిపోవడం ఆ జట్టును మరింత ఉత్సాహపరచింది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని పాక్ కట్టడి కూడా చేయగలిగింది కూడా.
అయితే పాక్ ఆశించినట్లుగా 1992 పునరావృతం కాలేదు. బెన్ స్టోక్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 43 మ్యాచ్‌ల టి20 కెరీర్‌లో తన తొలి అర్ధసెంచరీ చేసేందుకు అతను సరైన సమయాన్ని ఎంచుకున్నట్లున్నాడు. చివరి వరకూ నిలబడి మరోసారి తన చేతుల మీదుగా ఇంగ్లండ్‌ను వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిపాడు.
2012లో వెస్టిండీస్ అలా విజేతగా..
శ్రీలంక వేదికగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీ20 ప్రపంచకప్-2012 ఫైనల్లో వెస్టిండీస్ ఆతిథ్య శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు జాన్సన్ చార్ల్స్(0), క్రిస్ గేల్ (3) వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్లన్ సామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.
మిగిలిన వాళ్లలో డ్వేన్ బ్రావో 19, కెప్టెన్ డారెన్ సామీ 26(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సామీ బృందం 137 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ మహేల జయవర్దనే 33 పరుగులతో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ డకౌట్ అయ్యాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ సంగక్కర 22 పరుగులు చేయగా.. నువాన్ కులశేఖర 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల స్కోరు కనీసం ఐదు పరుగులు కూడా దాటకుండా విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో18.4 ఓవర్లలో 101 పరుగులకే లంక ఆలౌట్ అయింది.
నాడు అదరగొట్టిన విండీస్ బౌలర్లు
వెస్టిండీస్ బౌలర్లలో సునిల్ నరైన్ 3.4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చగా.. సామీ రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సామ్యూల్ బద్రీకి ఒకటి, రవి రాంపాల్‌కు ఒకటి, మార్లన్ సామ్యూల్స్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రతిభతో మార్లన్ సామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
2022లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఇలా
టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. షాన్ మసూద్ (28 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (3/12) పాక్‌ను పడగొట్టగా... ఆదిల్ రషీద్, జోర్డాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. 6 మ్యాచ్‌లలో 11.38 సగటు, 6.52 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్యామ్ కరన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు.
అంతా విఫలం...
ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ (15) పాక్‌కు దూకుడైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు ఒకే ఒక బౌండరీ (సిక్స్) కొట్టగా, తర్వాతి ఓవర్లో రిజ్వాన్ వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో స్కోరు 39 పరుగులకు చేరింది. ధాటిగా ఆడగల హారిస్ (8)ను రషీద్ తన తొలి బంతికే అవుట్ చేయగా, 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు 68 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లే ఉన్నాయి!
లివింగ్‌స్టోన్ ఓవర్లో 4, 6తో మసూద్ జోరును పెంచే ప్రయత్నం చేయగా, బాబర్‌ను చక్కటి రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసి రషీద్ మళ్లీ దెబ్బ కొట్టాడు. ఇఫ్తికార్ (0) కూడా చేతులెత్తేయడంతో పాక్ కష్టాలు మరింత పెరిగాయి. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాక్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో జట్టు పరిస్థితి మరీ ఘోరంగా కనిపించింది.
చివరి 4 ఓవర్లలో పాక్ కేవలం 18 పరుగులు మాత్రమే జోడించి ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున 4 వికెట్లు కోల్పోయింది. దాంతో కనీస స్కోరును కూడా సాధించలేక పాక్ ఇన్నింగ్స్ ముగించింది.
హేల్స్ విఫలం...
ఛేదనలో ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడలేదు. అయితే లక్ష్యం బాగా చిన్నది కావడంతో జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో ఆ జట్టు విజయాన్నందుకుంది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేయగా, జోస్ బట్లర్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
ఆపై నసీమ్ తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ మూడు ఫోర్లతో ఎదురుదాడి చేసింది. రవూఫ్ తన రెండు వరుస ఓవర్లలో సాల్ట్ (10), బట్లర్‌లను అవుట్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 49/3 వద్ద నిలిచింది. ఈ దశలో పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు.
బౌండరీలు రావడం కష్టంగా మారిపోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు ఇంగ్లండ్ బౌండరీ కొట్టలేకపోయింది! అయితే స్టోక్స్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్ (23 బంతుల్లో 20; 1 ఫోర్) అవుటైనా... సింగిల్స్‌తోనే పరుగులు రాబడుతూ తన వికెట్ మాత్రం అప్పగించకుండా జాగ్రత్త పడ్డాడు. గాయంతో అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆ ఓవర్ పూర్తి చేసేందుకు ఇఫ్తికార్ రాగా వరుసగా 4, 6 బాదాడు.
24 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో వసీమ్ వేసిన 17వ ఓవర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) 3 ఫోర్లు కొట్టడంతో పని సులువైంది. వసీమ్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్... చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఇంగ్లండ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిపాడు.
చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే టైటిల్ గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment