
అఫ్గనిస్తాన్ పరాజయం.. సెహ్వాగ్, జడేజా ఏమన్నారంటే...!
‘They are better than this’ – Virender Sehwag, Ajay Jadeja: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో అఫ్గనిస్తాన్ ప్రయాణం ముగిసింది. అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడి.. ఇంటిబాట పట్టింది. కాగా ఈ ఏడాది నేరుగా సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధించిన అఫ్గన్.. స్కాట్లాండ్, నమీబియా జట్లను భారీ తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. అంతేగాక పాకిస్తాన్‌కు గట్టిపోటీ నిచ్చి అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. అయితే, టీమిండియా చేతిలో ఓటమి.. నవంబరు 7న న్యూజిలాండ్ మ్యాచ్‌లో పరాజయం పాలుకావడంతో కేవలం ఐదింట కేవలం రెండు విజయాలకే పరిమితమై ఇంటికి పయనమైంది.
ఈ క్రమంలో కివీస్ విజయం సాధించి సెమీస్ చేరగా.. అఫ్గన్‌తో పాటు టీమిండియాకు కూడా తీవ్ర నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్ అఫ్గనిస్తాన్ ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరంభంలో మంచి విజయాలు నమోదు చేసిన నబీ బృందం.. ముందుకు వెళ్తున్న కొద్దీ తమ స్థాయికి తగినట్లు ఆడలేదని అభిప్రాయపడ్డారు. కివీస్ చేతిలో అఫ్గన్ ఓటమి అనంతరం అజయ్ జడేజా మాట్లాడుతూ... ‘‘టోర్నీ ఆరంభంలో కాస్త తడబడినా.. దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. గెలిచి తమ సత్తా చాటింది.
అఫ్గనిస్తాన్ మాత్రం ఇలాంటి ఆటతీరు కనబరచలేకపోయింది. వాళ్ల బ్యాటింగ్ తీరు తీవ్రంగా నిరాశపరిచింది. వాళ్ల స్థాయికి తగ్గట్లు ఆడలేదు. అయితే, గత కొన్నేళ్లుగా వారు ఎదిగిన విధానం అమోఘం. దానిని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి కివీస్‌తో మ్యాచ్‌లో మెరుగ్గా ఆడగల సత్తా వారికి ఉంది. కానీ, అలా జరుగలేదు’’ అని క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు. ఇక ఇందుకు స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్... ‘‘అఫ్గన్ బ్యాటర్లు కచ్చితంగా ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. 125- 130 పరుగులు చేయగలిగారు. 30- 40 పరుగులు చేస్తే చాలా బాగుండేది.
కానీ అలా జరుగలేదు. ఒకవేళ ఇలాంటి స్కోరు నమోదు చేయగలిగితే పెద్ద జట్లకు కూడా వాళ్లు గట్టి పోటీ ఇవ్వగలరు. స్కాట్లాండ్, నమీబియాపై గెలిచారు. న్యూజిలాండ్‌ను కూడా ఓడించాలని మనం కోరుకున్నాం. కానీ అలా జరుగలేదు. ఏదేమైనా.. అనుభవం గడిస్తున్న కొద్దీ వాళ్లు మెరుగ్గా రాణించగలరు’’ అని చెప్పుకొచ్చాడు.
కాగా కివీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గనిస్తాన్.. 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్.. 18.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి సెమీస్‌కు దూసుకెళ్లింది.
స్కోర్లు:
అఫ్గనిస్తాన్- 124/8 (20)
న్యూజిలాండ్- 125/2 (18.1).
చదవండి: T20 World Cup 2021 Pak Vs SCO: ఐదుకు ఐదు గెలిచి పాక్ టాప్.. అట్టడుగున స్కాట్లాండ్