T20 World Cup 2021: Do You Know India Get As Much Money As Namibia: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగిసి రెండు వారాలు కావొస్తున్నా మెగా ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు ఇప్పటికీ అభిమానుల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలంగా అందన్ని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా... ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.
తొలుత పాకిస్తాన్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లలో ఓడి కనీసం సెమీస్ చేరకుండానే కోహ్లి సేన వెనుదిరగడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అదే సమయంలో ఈ మెగా టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన నమీబియా... ఏకంగా రౌండ్ 12కు చేరడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు... పసికూన నమీబియా.. అత్యంత సంపన్న బోర్డుకు చెందిన టీమిండియాతో సమానంగా ప్రైజ్ మనీ గెలుచుకుంది తెలుసా!
ప్రైజ్ మనీ 1.42 కోట్లు
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా నిర్వహించిన సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించిన జట్లకు 52 లక్షల రూపాయాలతో పాటు టోర్నీలో విజయాల ఆధారంగా అదనంగా ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కింది.
ఇక గ్రూపు-2లో ఉన్న భారత్.. పాకిస్తాన్, కివీస్ చేతిలో ఓడినా.. అఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ 12కు నేరుగా అర్హత సాధించిన కోహ్లి సేనకు 52 లక్షల రూపాయలు సహా... మూడు విజయాలకు గానూ 90 లక్షలు... అంటే మొత్తంగా 1.42 కోట్ల రూపాయలు ముట్టాయి.
నమీబియా సైతం టీమిండియా మాదిరిగానే 1.42 కోట్లు దక్కించుకుంది. స్కాట్లాండ్‌కు కూడా కోటి నలభై రెండు లక్షలు గెలుచుకుంది. ఈ రెండు జట్లు సూపర్ 12లో భారీ స్థాయిలో రాణించకపోయినా... క్వాలిఫైయర్స్‌లో విజయాలు సాధించినందుకు ఈ మొత్తం అందుకున్నాయి. మరి.. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు అయిన టీమిండియా.. మెగా ఈవెంట్‌లో ఈ చిన్న జట్ల మాదిరిగానే అదే స్థాయి ప్రైజ్ మనీ గెలుచుకోవడం గమనార్హం.
టీ20 వరల్డ్‌కప్-2022 ఎప్పుడంటే!
ఈ ఏడాది చాంపియన్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్-2022 ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు 16 నుంచి పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. నవంబరు 13న ఫైనల్ నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2021 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ సహా ఇండియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సూపర్ 12 దశకు నేరుగా అర్హత సాధించాయి. నమీబియా, స్కాట్లాండ్, రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్, మాజీ చాంపియన్ శ్రీలంక క్వాలిఫయర్స్ ఆడనున్నాయి.
ఇక ఈ ఏడాది టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా సారథి కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో రన్నరప్ న్యూజిలాండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి భారత్ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఇలాగే విజయపరంపర కొనసాగించడమే గాక.. 2022 వరల్డ్‌కప్ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: IPL 2022 Mega Auction: ఎటూ తేల్చుకోలేకపోతున్న సన్‌రైజర్స్.. రషీద్ ఖాన్‌కు గుడ్‌బై.. అదే జరిగితే!
Comments
Please login to add a commentAdd a comment