
Shakib Al Hasan Breaks Lasith Malinga Record: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీల్లో ప్రపంచ రికార్డు బద్దలైంది. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ(107 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(108) అధిగమించాడు. నిన్నటి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మలింగ 84 టీ20 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు పడగొట్టగా.. షకిబ్ 89 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. మరోవైపు ఈ ఫార్మాట్‌లో వందకుపైగా వికెట్లు తీసి వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా షకీబ్ కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే, గ్రూప్-బీ పోటీల్లో భాగంగా నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. పసికూన స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్కాట్లాండ్ ఆటగాడు క్రిస్ గ్రీవ్స్ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2/19) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్కాట్లాండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనతంరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 20 ఓవర్లలో 134/7 స్కోరుకే పరిమితమైంది. బంగ్లాదేశ్‌కు చివరి ఓవర్‌లో 24 పరుగులు అవసరం కాగా మెహిదీ హసన్ (13), సైఫుద్దీన్ (5) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది మొత్తం 17 పరుగులు రాబట్టారు. చివరి బంతికి ఏడు పరుగులు అవసరం కాగా మెహిది సింగిల్ తీయడంతో స్కాట్లాండ్ విజయం సాధించింది.
చదవండి: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..