టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అసాధారణమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టాడని ఇంజి ఆరోపించాడు.
అర్ష్‌దీప్ తన సెకెండ్ స్పెల్‌లో (16వ ఓవర్‌లో) కొత్త బంతితో రివర్స్ స్వింగ్‌ను ఎలా రాబట్టగలిగాడని ప్రశ్నించాడు. సహజంగా బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ అవుతుంది. అలాంటిది అర్ష్‌దీప్ కొత్త బంతితో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడని నిలదీశాడు. బాల్ టాంపరింగ్‌కు పాల్పడకుండా ఆటగాళ్లపై కన్నేసి ఉంచాలని అంపైర్లకు సూచించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ ఆరోపణలు చేశాడు.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా లక్ష్యానికి 25 పరుగుల దూరంలో (20 ఓవర్లలో 181/7) నిలిచిపోయింది. అర్ష్‌దీప్ సింగ్ (4-0-37-3), కుల్దీప్ యాదవ్ (4-0-24-2), బుమ్రా (4-0-2-9-1) ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించాయి. జూన్ 27 ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. అదే రోజు రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment