టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 14) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏ నుంచి సూపర్-8 రెండో బెర్త్ కోసం యూఎస్‌ఏ.. ఐర్లాండ్‌తో పోటీపడనుంది. యూఎస్‌ఏ ఈ మ్యాచ్‌లో గెలిచినా లేక వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం పోటీపడుతున్న మరో జట్టు పాక్ భవితవ్యం నేటి మ్యాచ్‌తో తేలిపోనుంది.
ఇవాల్టి మ్యాచ్‌లో యూఎస్‌ఏ గెలిచినా లేక మ్యాచ్ రద్దైనా పాక్ తదుపరి ఆడాల్సిన మ్యాచ్‌తో (ఐర్లాండ్) సంబంధం లేకుండా ఇంటిదారి పడుతుంది. గ్రూప్-ఏ నుంచి భారత్ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించగా.. యూఎస్‌ఏ, పాక్‌ల మధ్య రెండో బెర్త్ కోసం పోటీ నెలకొంది.
టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి గ్రూప్-ఏ టాపర్‌గా ఉండగా.. యూఎస్‌ఏ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాక్ విషయానికొస్తే.. దాయాది జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి రెండింట ఓడి రెండు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఒకవేళ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఓడి.. పాక్ తదుపరి ఐర్లాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే పాక్‌కు సూపర్-8కు చేరే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా జరిగేందుకు ప్రకృతి సహకరించడం లేదు. యూఎస్‌ఏ-ఐర్లాండ్‌ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నేటి మ్యాచ్ జరగడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే యూఎస్‌ఏ ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధిస్తుంది.
ఇదిలా ఉంటే, ఇవాళే మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా-నేపాల్.. గ్రూప్-సి నుంచి న్యూజిలాండ్-ఉగాండ జట్లు పోటీపడనున్నాయి. యూఎస్‌ఏ-ఐర్లాండ్ మధ్య జరునున్న మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. సౌతాఫ్రికా-నేపాల్ మ్యాచ్ కింగ్స్‌టౌన్ వేదికగా రేపు తెల్లవారుజామున 5 గంటలకు మొదలవుతుంది. న్యూజిలాండ్-ఉగాండ మధ్య జరగాల్సిన మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment