
నేటి నుంచి టి20 వరల్డ్ కప్
బరిలో 20 జట్లు
తొలి పోరులో కెనడాతో అమెరికా ఢీ
బుధవారం భారత్ మొదటి మ్యాచ్
పదిహేడేళ్ల క్రితం... ఐసీసీ తొలి టి20 ప్రపంచకప్‌ను నిర్వహించింది. ఆ మెగా ఈవెంట్‌లో విజేతగా నిలిచిన భారత్ టి20 ఫార్మాట్‌కు కొత్త దశ, దిశను చూపించింది. కానీ ఆ తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ మరో టైటిల్ సాధించడంలో విఫలమైంది. ఇప్పుడైనా మన అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడుతుందా!
మరో వైపు విధ్వంసక బ్యాటింగ్‌తో ఆట రూపు మార్చిన వెస్టిండీస్, ఇంగ్లండ్ రెండేసి ట్రోఫీలతో అగ్ర స్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్లు తమకు తెలిసిన అదే విద్యతో మూడో టైటిల్‌పై కన్నేశాయి. ఆల్‌రౌండర్ల అడ్డా ఆస్ట్రేలియా, మరో మాజీ చాంపియన్ శ్రీలంక రెండో ట్రోఫీపై గురి పెట్టాయి. ఈ సారైనా తొలి టైటిల్ అందుకోవాలని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా విశ్వప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఇక గత ఫైనలిస్ట్ పాకిస్తాన్ కూడా అనూహ్య ప్రదర్శనతో మరో సారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరం. ఈ ఎనిమిది అగ్రశ్రేణి జట్లకు తోడు మరో 12 టీమ్‌లు విశ్వ వేదికపై తమ ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో టి20 ప్రపంచ కప్ సంగ్రామానికి నేటితో తెర లేవనుంది.
న్యూయార్క్: తొలి సారి అగ్రరాజ్యం అమెరికా వేదికగా క్రికెట్ ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్‌తో కలిసి ఈ సారి అమెరికా టి20 వరల్డ్ కప్ టోరీ్నకి ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్‌లో 2010లోనే ఈ మెగా పోరు జరిగింది. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరింపజేయడంలో భాగంగా ఐసీసీ తొలి సారి 20 జట్లతో వరల్డ్ కప్ నిర్వహిస్తోంది.
ర్యాంకింగ్, ఆతిథ్య జట్టు హోదాలో టీమ్‌లు ముందుగా అర్హత సాధించగా...క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఇతర జట్లు బరిలో నిలిచాయి. ఈ టోర్నీ కోసం అమెరికాలో ప్రత్యేకంగా క్రికెట్ మైదానాలను సిద్ధం చేశారు. అప్పటికి మల్టీ పర్పస్ స్టేడియాలుగా ఉన్నవాటిని బయటినుంచి తీసుకొచ్చిన ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లతో క్రికెట్ మ్యాచ్‌ల వేదికలుగా మార్చారు.
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగంగా ఉండటంతో ఈ వరల్డ్ కప్ ద్వారా అక్కడి అభిమానులను ఆకర్షించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. తొలి పోరులో ఆతిథ్య అమెరికా జట్టు తమ చిరకాల ప్రత్యర్థి కెనడాతో తలపడనుంది.
నాలుగు గ్రూప్‌లుగా...
మొత్తం 20 జట్లను 5 జట్ల చొప్పున 4 గ్రూప్‌లుగా విభజించారు. ఆయా జట్లు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో తలపడతాయి. టాప్–2లో నిలిచిన రెండు టీమ్‌లు ముందంజ వేస్తాయి. ఆ దశలో ఎనిమిది టీమ్‌లతో రెండు గ్రూప్‌లుగా విడదీసి సూపర్ ఎయిట్ నిర్వహిస్తారు. ఇక్కడ మరో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆపై సెమీస్, ఫైనల్ జరుగుతాయి. వెస్టిండీస్‌లో ఆరు, అమెరికాలలో మూడు వేదికలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
భారత్ ఎంత వరకు...
తొలి వరల్డ్ కప్ విజయాన్ని మినహాయిస్తే భారత్ మరో మూడు సార్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చింది. 2014లో ఫైనల్లో ఓడిన జట్టు...2016, 2022లలో సెమీ ఫైనల్ చేరింది. మిగిలిన నాలుగు సందర్భాల్లో లీగ్ దశకే పరిమితమైంది. ఈ సారి కూడా దాదాపుగా రెండేళ్ల క్రితం బరిలోకి దిగిన జట్టుతోనే టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
రోహిత్ శర్మ కెపె్టన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఈ బృందం తమ అత్యుత్తమ ఆటతీరును కనబరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. మన జట్టు స్థాయి, ఆటగాళ్ల ఫామ్‌ను చూస్తే సెమీఫైనల్ వరకు వెళ్లడం ఖాయం. మిగిలిన రెండు నాకౌట్ మ్యాచ్‌లే కీలకమైనవి.
వరల్డ్ కప్‌లో నేటి మ్యాచ్‌లు
అమెరికా X కెనడా
ఉదయం.గం.6.00 నుంచి
వెస్టిండీస్ X పపువా న్యూగినియా
రాత్రి.గం. 8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment