చిట్టగాంగ్: బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట మూడో రోజు బౌలర్లు చెలరేగడంతో ఆదివారం ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. దాంతో ఇరు జట్లను గెలుపు ఊరిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 39 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (12 బ్యాటింగ్; 1 ఫోర్), యాసిర్ అలీ (8 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు.
పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 145/0తో ఆటను ఆరంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 115.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ను తైజుల్ ఇస్లామ్ (7/116) దెబ్బ తీశాడు. మూడో రోజు తొలి ఓవర్‌లోనే అతడు అబ్దుల్లా షఫీక్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (0) వికెట్లను తీశాడు. ఓవర్‌నైట్ బ్యాటర్ ఆబిద్ అలీ (133; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీని పూర్తి చేశాడు. ఆబిద్ అలీని కూడా తైజుల్ అవుట్ చేయడంతో పాకిస్తాన్ పతనం ఆరంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment