స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో, చిన్న జట్లతో జరిగే వన్ టు వన్ సిరీస్‌ల్లో బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా.. విదేశాల్లో జరిగే సిరీస్‌ల్లో, అలాగే పెద్ద జట్లు పాల్గొనే నాకౌట్ మెగా టోర్నీల్లో చతికిలపడటం చాలాకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. టీమిండియా ఆటగాళ్లు సొంతగడ్డపై మాత్రమే పులులు అన్న అపవాదును సైతం మనం చాలాకాలంగా మోస్తూనే ఉన్నాం. ధోని హయాంలో, కొద్దికాలం పాటు విరాట్ కోహ్లి జమానాలో ఈ అపవాదు తప్పని నిరూపించుకోగలిగినప్పటికీ, ఇటీవలి కాలంలో మళ్లీ పాత పరిస్థితే ఎదురవుతూ వస్తుంది.
రోహిత్ సారధ్య బాధ్యతలు చేపట్టాక ఆడిన రెండు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టిన టీమిండియా.. చిన్న జట్లపై, అలాగే స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం రెచ్చిపోతుంది. ఎంతలా అంటే.. డబుల్ సెంచరీలు, సెంచరీలు, 5 వికెట్లు తీసిన ఆటగాళ్లను కూడా బెంచ్‌కు పరిమితం చేసేంతలా సొంతగడ్డపై టీమిండియా దూకుడు ప్రదర్శిస్తుంది. రిజర్వ్ బెంచ్ సైతం ఇంత బలంగా ఉన్న జట్టు విదేశాల్లో, పెద్ద జట్లతో మ్యాచ్‌ల్లో, మెగా టోర్నీల్లో ఎందుకు ఓటమిపాలవుతుందన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే, ఒక్క విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది.
అదేంటంటే.. స్వదేశంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లు లేకపోవడం. ఇక్కడి సంప్రదాయ స్పిన్ పిచ్‌లకు అలవాటు పడి, వీటిపై పరుగుల వరద పారించే మన హీరోలు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ట్రాక్‌లపై ఆ దేశ పేసర్లకు దాసోహమైపోతున్నారు. ఇక మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యాల విషయానికొస్తే.. ఆడిన ప్రతి టోర్నీలో భారీ అంచనాలు జట్టు కొంపముంచుతున్నాయి. 130 కోట్లకు పైగా భారతీయులు ప్రతి మ్యాచ్‌లో జట్టు గెలవాలని కోరుకోవడం, అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వడం సమాంతరంగా జరిగిపోతున్నాయి.
విదేశాల్లో, మెగా టోర్నీల్లో టీమిండియా ఓటములకు మరో కారణం బీసీసీఐలో నెలకొన్న రాజకీయాలు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీ కాకుండా స్వయంగా బోర్డు అధ్యక్షుడే జోక్యం చేసుకునేంతలా బీసీసీఐ రాజకీయాలు భ్రష్ఠుపట్టాయి. ఆటగాళ్ల ఎంపికలో, తుది జట్టు కూర్పు విషయంలో బోర్డు పెద్దలు జోక్యం చేసుకోకుంటే.. కోచ్, కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బీసీసీఐ రాజకీయాలు మానుకుని పై పేర్కొన్న మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే స్వదేశంలో, చిన్న జట్లపై బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా ఆటగాళ్లు.. విదేశాల్లో, పెద్ద జట్లపై, మెగా టోర్నీల్లో తమ ప్రతాపం చూపుతారు.
Comments
Please login to add a commentAdd a comment