
అదరగొట్టిన భారత ‘ఎ’ లెగ్ స్పిన్నర్
చివరి వన్డేలో ఆస్ట్రేలియా ‘ఎ’పై టీమిండియా ‘ఎ’ ఘనవిజయం
క్వీన్స్‌లాండ్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ క్రికెట్ జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత ‘ఎ’ జట్టు 171 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టును చిత్తు చేసింది. భారత జట్టు విజయంలో లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా ముఖ్యపాత్ర పోషించింది.
ఆమె 5 ఓవర్లు వేసి 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇందు లో రెండు మెయిడెన్లు ఉన్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ కోల్పోయిన భారత్... ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. రాఘవి బిష్త్ (53; 7 ఫోర్లు), తేజల్ హసాబ్నిస్ (66 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు.
నాలుగో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కెప్టెన్ మిన్ను మణి (56 బంతుల్లో 34), సంజన (40; 4 ఫోర్లు) రాణించారు. 244 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ను భారత లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా హడలెత్తించింది.
ఢిల్లీకి చెందిన ప్రియా తన తొలి బంతికే వికెట్ పడగొట్టింది. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించిన ప్రియా ఆ్రస్టేలియా బ్యాటర్లను వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపించింది.
దాంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు 22.1 ఓవర్లలోనే కేవలం 72 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత ‘ఎ’ జట్టు వన్డే సిరీస్‌ను 1–2తో చేజార్చుకుంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఏకైక అనధికారిక టెస్టు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment