సిడ్నీ: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ తుది సమరానికి సిద్ధమైంది. గత మ్యాచ్ వేదికలోనే ఇరు జట్లు నేడు మూడో టి20లో తలపడనున్నాయి. వన్డే సిరీస్ తరహాలోనే చివరి మ్యాచ్ గెలిచి ఆసీస్ లెక్క సరి చేస్తుందా... లేక భారత్ తమ జోరు కొనసాగించి రెండోసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందా అనేది ఆసక్తికరం. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లో దిగే అవకాశం కనిపిస్తుండగా... ఆస్ట్రేలియా కూడా టెస్టు స్పెషలిస్ట్‌లను దూరంగా ఉంచాలనే నిర్ణయించింది.
నటరాజన్‌పైనే అందరి దృష్టి...
షమీ, బుమ్రాలవంటి సీనియర్లు లేకుండానే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకున్న భారత్ మరోసారి యువ బౌలర్లనే నమ్ముకోనుంది. భారీ స్కోర్లు నమోదైన గత మ్యాచ్‌లో కూడా కేవలం 20 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన నటరాజన్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్‌లో తన యార్కర్లతోనే గుర్తింపు తెచ్చుకున్నా... అంతకుమించి వైవిధ్యభరిత ప్రతిభ అతనిలో ఉందని తాజా ప్రదర్శన నిరూపించింది. మరో మ్యాచ్‌లోనూ రాణిస్తే ఆడిన తొలి సిరీస్‌లోనే నటరాజన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలవడం ఖాయం. మిగతా ఇద్దరు పేసర్లు దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్ కూడా ఆసీస్‌ను కట్టడి చేయగలరు. ఆఫ్ స్పిన్నర్ సుందర్ ఎప్పటిలాగే పొదుపుగా బౌలింగ్ చేస్తుండగా... లెగ్‌స్పిన్నర్ చహల్ తొలి టి20 మ్యాచ్ మ్యాజిక్‌ను మళ్లీ చూపించాల్సి ఉంది. బ్యాటింగ్‌పరంగా ఎలాంటి లోపాలు లేవు. కోహ్లి చెప్పినట్లు ఐపీఎల్ అనుభవం జట్టులో సభ్యులందరికీ ఈ సిరీస్ గెలుచుకోవడంలో బాగా పనికొచ్చింది.
ఫించ్ జట్టులోకి...
ప్రత్యర్థితో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయినా సరే తొలి మ్యాచ్‌లో లక్ష్యం ఛేదించలేక, రెండో మ్యాచ్‌లో దానిని కాపాడుకోలేక జట్టు చతికిలపడింది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. టి20 ప్రమాణాలపరంగా చూస్తే అతి పేలవంగా ఆడుతున్న డార్సీ షార్ట్‌పై వేటు ఖాయమైంది. వన్డే సిరీస్ తరహాలో మ్యాక్స్‌వెల్ నుంచి ఒక దూకుడైన ఇన్నింగ్స్‌ను ఆసీస్ ఆశిస్తోంది.
రానున్న టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన బౌలర్లకు విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్‌కు కూడా ఈ మ్యాచ్ నుంచి విరామం ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఆసీస్ అసలు సమస్య అంతా బౌలింగ్‌లోనే ఉంది. ఒక్క అనుభవజ్ఞుడైన ఆటగాడు కూడాలేని లైనప్ భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరిచడం అంత సులువు కాదు. టెస్టుల్లో కీలకమయ్యే పేసర్లను సిరీస్ కోల్పోయిన తర్వాత టి20ల్లో బరిలోకి దింపడం అనవసర మనే భావన టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఉంది.
పిచ్, వాతావరణం
తొలి రెండు వన్డేలు, రెండో టి20లో ఇక్కడ పరుగుల వరద పారింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి మరోసారి భారీ స్కోర్లు ఖాయం. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రాహుల్, సామ్సన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, చహల్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, క్యారీ, హెన్రిక్స్, సీన్ అబాట్, స్యామ్స్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై.
Comments
Please login to add a commentAdd a comment