IPL 2023 DC Vs MI: Tilak Varma Winner Of Dressing Room Player OF Match, Video Goes Viral - Sakshi
Sakshi News home page

#Tilak Varma: మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ మనోడే హీరో!

Published Wed, Apr 12 2023 6:30 PM | Last Updated on Wed, Apr 12 2023 7:12 PM

Tilak Varma Winner Of Dressing Room Player OF Match DC Vs MI Viral - Sakshi

Photo: MI Twitter

తెలుగు తేజం నంబూరి తిలక్‌ వర్మ... ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ జట్టులో కీలక ఆటగాడు. ఈ సీజన్‌లో ముంబై వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికి తాను మాత్రం విఫలం కాలేదు. రోహిత్‌ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొందిన తిలక్‌ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

అప్పటికే ధాటిగా ఆడుతున్న రోహిత్‌కు జతయ్యాడు. వాయువుకు అగ్ని తోడయినట్లుగా రోహిత్‌ అండతో తిలక్‌ వర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఔటైనప్పటికి అప్పటికే ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు. నిజానికి తిలక్‌ వర్మ ఔట్‌ కాకపోయుంటే ముంబై మ్యాచ్‌ను 17 లేదా 18 ఓవర్లలోనే ముగించి ఉండేది. అయితే తిలక్‌ వర్మ, రోహిత్‌లు వెనువెంటనే ఔట్‌ కావడంతో మ్యాచ్‌ చివరి వరకు వెళ్లింది. ఆఖరి బంతికి ఉత్కంఠగా మారినప్పటికి టిమ్‌ డేవిడ్‌ రెండు పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ సీజన్‌ మంచి ఫామ్‌ కనబరుస్తున్న తిలక్‌ వర్మ మూడు మ్యాచ్‌లు కలిపి 147 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉ‍న్నాడు. అతని ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మనోడు మైదానంలోనే కాదు డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ హీరోగా నిలిచాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ గెలిచాకా ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌కు ఫ్రాంచైజీ ఓనర్‌ నీతా అంబానీ వచ్చారు.  ఈ క్రమంలో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను మెచ్చుకున్న ఆమె బ్యాడ్జ్‌లను అందించారు.

ఈ నేపథ్యంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈరోజు మ్యాచ్‌లో రోహిత్‌, తిలక్‌ వర్మలు ఇద్దరు కీలకపాత్ర పోషించారు. కానీ నా దృష్టిలో నిజమైన విన్నర్‌ తిలక్‌ వర్మ.. అందుకే అతనికి డ్రెస్సింగ్‌ రూమ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందజేస్తున్నాం అంటూ తెలిపింది. అనంతరం తిలక్‌ వర్మ పొలార్డ్‌ చేతుల మీదుగా తన షర్ట్‌కు బ్యాడ్జ్‌ పెట్టించుకున్నాడు. ''చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు స్పెషల్‌.. సీజన్‌లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇలానే రాణించాలని కోరుకుంటున్నా థాంక్యూ'' అని తెలిపాడు. ఇక బౌలర్లలో పియూష్‌ చావ్లా బ్యాడ్జ్‌ను అందుకున్నాడు.

చదవండి: 'మీరు కర్మని నమ్మారు.. మేం మాత్రం శర్మని నమ్మాం'


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement