అశ్విన్‌ పరుగుల విధ్వంసం.. సిక్సర్ల మెరుపులు.. వీడియో | TNPL 2024: Ravichandran Ashwin Scores Quickfire 45 off 20 balls Video Viral | Sakshi
Sakshi News home page

అశ్విన్‌ పరుగుల విధ్వంసం.. సిక్సర్ల మెరుపులు.. వీడియో

Published Mon, Jul 15 2024 6:32 PM | Last Updated on Mon, Jul 15 2024 6:42 PM

TNPL 2024: Ravichandran Ashwin Scores Quickfire 45 off 20 balls Video Viral

భారత స్పిన్‌ మాస్టర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాట్‌తో దుమ్ములేపాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అశూ అన్న బ్యాటింగ్‌ మెరుపులకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌-2024 సీజన్‌ జూలై 5న మొదలైంది. ఈ టీ20 టోర్నీలో దిండిగల్‌ డ్రాగన్స్‌ జట్టుకు అశ్విన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అశూ సారథ్యంలో తొలి మ్యాచ్‌లో ట్రిచీ గ్రాండ్‌ చోళాస్‌ జట్టును ఓడించిన దిండిగల్‌ జట్టు.. తదుపరి మ్యాచ్‌లో సేలం స్పార్టాన్స్‌ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌తో ఆదివారం తమ మూడో మ్యాచ్‌లో తలపడింది.

కోయంబత్తూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెపాక్‌ జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో శివం సింగ్‌(0)తో కలిసి ఓపెనింగ్‌ చేసిన అశూ ధనాధన్‌ దంచికొట్టాడు.

అశూ పరుగుల విధ్వంసం
కేవలం ఇరవై బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అశ్విన్‌కు పెద్దగా సహకారం అందలేదు.

ఇక ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా.. ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో అశూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత ఏడు ఓవర్లలో దిండిగల్‌ డ్రాగన్స్‌ ఆరు వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసింది.

దిండిగల్‌ టీమ్‌కు తప్పని ఓటమి
లక్ష్య ఛేదనకు దిగిన చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ కేవలం 4.5 ఓవర్లలనే పని పూర్తి చేసింది. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ నారాయణన్‌ జగదీశన్‌ 14 బంతుల్లోనే 32 పరుగులు చేయగా.. కెప్టెన్‌ బాబా అపరాజిత్‌ 14 బంతుల్లో 31 రన్స్‌ సాధించాడు.

వీరిద్దరు కలిసి ఆడుతూ టార్గెట్‌ను ఛేదించగా.. దిండిగల్‌ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా అశూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది.

అయితే, క్రీజులో ఉన్నంత సేపు అశ్విన్‌ ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయడం అభిమానులకు సంతోషాన్నిచ్చిది. అశూ ఇన్నింగ్స్‌ వీడియో తాజాగా వెలుగులోకి రాగా ఫ్యాన్స్‌ ఈ దృశ్యాలను షేర్‌ చేస్తున్నారు. ఇక దిండిగల్‌ తదుపరి బుధవారం ఐడ్రీమ్‌ తిరుపూర్‌ తమిళన్స్‌ జట్టుతో తలపడనుంది.

ఎనిమిది జట్లు.. ప్రస్తుతం టాపర్‌గా లైకా కోవై కింగ్స్‌
తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌-2024 ఎడిషన్‌లో ఎనిమిది జట్లు భాగమయ్యాయి. లైకా కోవై కింగ్స్‌ మూడింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది.

మిగిలిన స్థానాల్లో వరుసగా ట్రిచీ గ్రాండ్‌ చోళాస్‌(2 విజయాలు), చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌(2 విజయాలు), నెల్లై రాయల్‌ కింగ్స్‌(2 విజయాలు), ఐడ్రీమ్‌ తిరుపూర్‌ తమిళన్స్‌(1 విజయం), దిండిగల్‌ డ్రాగన్స్‌(1 విజయం), సేలం స్పార్టన్స్‌(1 విజయం), సీచం మధురై పాంథర్స్‌(1 విజయం) ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement