
అంతా సవ్యంగా సాగితే... ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటివరకు భారత్‌కు లోటుగా ఉన్న అథ్లెటిక్స్ పతకం ఈరోజు లభించే అవకాశముంది. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ నేడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల కమల్‌ప్రీత్ క్వాలిఫయింగ్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా పతకంపై ఆశలు చిగురించాయి. క్వాలిఫయింగ్‌లోని తన గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా కమల్‌ప్రీత్ రెండో స్థానంలో నిలువడంతో ఆమెపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం నేటి ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడతారు.
ఒక్కొక్కరికి డిస్క్‌ను విసిరేందుకు మూడు అవకాశాలు ఇస్తారు. డిస్క్‌ను ఎక్కువ దూరం విసిరిన ముగ్గురికి వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ సాండ్రా పెర్కోవిచ్ (క్రొయేషియా)... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వైమి పెరెజ్ (క్యూబా) క్వాలి ఫయింగ్‌లో కమల్‌ప్రీత్ కంటే వెనుకబడ్డారు. కమల్‌ప్రీత్ డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరితే... సాండ్రా పెర్కోవిచ్ 63.75 మీట ర్లు... వైమి పెరెజ్ 63.18 మీటర్లు విసి రారు. వలారీ అల్‌మన్ (అమెరికా) 66.42 మీటర్లు విసిరి క్వాలిఫయింగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. అయితే అగ్రశ్రేణి అథ్లెట్స్ క్వాలిఫయింగ్‌లో కంటే ఫైనల్లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తారు. ఈ నేపథ్యంలో ఫైనల్ ఆసక్తికరంగా సాగే అవకాశముంది.