
సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్, పాకిస్తాన్ (PC: ACC X)
ACC U19 Asia Cup, 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత టీనేజ్ సీమర్ రాజ్ లింబాని అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా నేపాల్‌తో మ్యాచ్‌లో (7/13) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో యువ భారత జట్టు అలవోక విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
కాగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను 18 ఏళ్ల రాజ్ లింబాని స్పెల్ హడలెత్తించింది. దీంతో నేపాల్ 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. రాజ్ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
నేపాల్ ఓపెనర్ల నుంచి ఆఖరి వరుస బ్యాటర్ వరకు అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత జట్టు 7.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసి ఛేదించింది. అర్షిన్ కులకర్ణి (30 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
అర్షిన్, ఆదర్శ్ సింగ్ (13 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన ఓపెనింగ్ బాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఇక ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను భారత యువ జట్టు చిత్తు చేసింది.
గ్రూప్-ఏ టాపర్‌గా పాకిస్తాన్
ఈ క్రమంలో మొత్తంగా... ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన భారత్ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు.. దాయాది జట్టు పాకిస్తాన్ మంగళవారం నాటి రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 83 పరుగుల తేడాతో అఫ్గన్‌ను మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. తద్వారా ఆడిన మూడింట మూడు నెగ్గి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
ACC Men's U19 Asia Cup | Pakistan-U19 vs Afghanistan-U19 | Highlights. https://t.co/E72GAXu9OB#ACCMensU19AsiaCup #ACC
— AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023
Comments
Please login to add a commentAdd a comment