
2023 ఏడాదిని యూఏఈ క్రికెట్ జట్టు సంచలన విజయంతో ముగించింది. ఆదివారం షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 11 పరుగుల తేడాతో యూఏఈ విజయం సాధించింది. ఓవరాల్‌గా అఫ్గాన్‌పై యూఏఈకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(53), ఆర్యన్ లాక్రా(63) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్జాయ్, క్వైస్ అహ్మద్ తలా రెండు వికట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నబీ చెరో వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది.
అఫ్గాన్ బ్యాటర్లలో నబీ( 27 బంతుల్లో 47) పోరాడనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. యూఏఈ బౌలర్లలో అలీ నసీర్, జవదుల్లా చెరో 4 వికెట్లతో సత్తాచాటారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 జనవరి 3న షార్జా వేదికగా జరగనుంది.