ఉమ్రాన్ మాలిక్
Asian Games 2023- Umran Malik: ఆసియా క్రీడలు- 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు వెళ్లనన్ను భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టులో భాగమైన పేసర్ శివం మావి మెగా ఈవెంట్‌కు దూరం కానున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం గాయపడిన మావి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.
భారత జట్టుకు గాయాల బెడద
ఈ క్రమంలో శివం మావి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టాండ్ బైగా ఉన్న యశ్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి ప్రమోట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఉమ్రాన్‌తో పాటు అతడి పేరు పరిశీలనలో
అయితే, ఈ విదర్భ పేసర్ సైతం ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నందున అతడిని కూడా పక్కనపెట్టిన సెలక్టర్లు.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ లేదా కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణలలో ఒకరిని ఎంపిక చేయనున్నారట.
ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
తొలిసారి భారత క్రికెట్ జట్లు
చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లను తొలిసారిగా ఈ టోర్నీకి పంపేందుకు అంగీకరించిన బీసీసీఐ ఇప్పటికే జట్లను ప్రకటించింది.
శిక్షణా శిబిరం
అక్టోబరు 5 నుంచి మెన్స్ వన్డే వరల్డ్‌కప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును పంపేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. ఆసియా గేమ్స్ విలేజ్‌కు వెళ్లే ముందు భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రెండు వారాల పాటు శిక్షణా శిబిరంలో పాల్గొనున్నారు.
ఇక భారత పురుషుల జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సాయిరాజ్ బహుతులే బౌలింగ్, మునీశ్ బాలి ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ జట్లు పోటీపడనున్నాయి.
ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
మహిళా క్రికెట్ జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి
స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.
చదవండి: Ind vs SL: టీమిండియా బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే!
5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే?
Comments
Please login to add a commentAdd a comment