లండన్: టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి క్రికెట్ అభిమానులచే చివాట్లు తింటున్నా తీరు మార్చుకోని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖత మైఖేల్ వాన్.. తాజాగా మరోసారి కోహ్లి సేనపై తన అక్కసును వెల్లగక్కాడు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లంతా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సచిన్, ఏబీ డివిలియర్స్, సెహ్వాగ్, షేన్ వార్న్, గంగూలీ ఇలా చాలా మంది లెజెండరీ క్రికెటర్లు కోహ్లి సేనను ఆకాశానికెత్తుతున్నారు. అయితే ఇది మింగుడు పడని మైఖేల్ వాన్.. గంగూలీ చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, టీమిండియాను పరోక్షంగా ఎగతాళి చేశాడు.
In Test cricket .. not White ball cricket 👍 https://t.co/t5M3HQTB1c
— Michael Vaughan (@MichaelVaughan) September 6, 2021
వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన అనంతరం టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య నైపుణ్యంలో తేడా ఉందని, అతిపెద్ద వ్యత్యాసం ఒత్తిడిని అధిగమించడంలో ఉందని, ఈ విషయంలో భారత క్రికెటర్లు ఇతరులతో పోలిస్తే ఎన్నో రేట్లు మేలని ట్వీటాడు.
అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఇంగ్లండ్ మాజీ సారధి తనకు మాత్రమే సొంతమైన వెటకారాన్ని ప్రదర్శిస్తూ టీమిండియాను కవ్విస్తున్నట్లు బదులిచ్చాడు. గంగూలీ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. 'టెస్ట్‌ల్లో మాత్రమే, వైట్ బాల్ క్రికెట్‌లో కాదు' అంటూ వ్యంగ్యంగా రీట్వీట్ చేశాడు. దీంతో అతనిపై టీమిండియా అభిమానులు ముప్పేట దాడి మొదలుపెట్టారు. సోషల్‌మీడియా వేదికగా ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా, ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి వాన్.. టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కోహ్లి సేన స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక కుప్పకూలుతుందంటూ ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు. అయితే వాన్ ఇలాంటి కామెంట్లు చేసిన ప్రతిసారి టీమిండియా రెట్టింపు కసితో ఆడి విజయాలు సాధిస్తూ వస్తుంది.
చదవండి: భూగ్రహం మొత్తంలో టీమిండియా కెప్టెన్‌కు మించినోడే లేడు: షేన్ వార్న్
Comments
Please login to add a commentAdd a comment