విరాట్ కోహ్లి- ఫాఫ్ డుప్లెసిస్
Virat Kohli- RCB Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోయినా క్రేజ్ మాత్రం తగ్గని జట్టు ఏదైనా ఉందంటే టక్కున గుర్తుకువచ్చే పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
గత పదిహేను ఎడిషన్లలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గకపోయినా కోహ్లి చరిష్మాతో నేటికీ ఆర్సీబీ ఫేవరెట్ జట్టుగానే కొనసాగుతోంది. అయితే, గత సీజన్‌లో విరాట్ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
తనదైన శైలిలో జట్టును ముందు నడిపి మంచి ఫలితాలే రాబట్టాడు. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు. అయితే, ఈసారి ఆర్సీబీ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇందుకు కూడా కోహ్లినే కారణం.
పూర్వ వైభవం
పొట్టి ఫార్మాల్లో కోహ్లి అవసరం పెద్దగా ఉండబోదన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆసియా కప్ టీ20 టోర్నీ సందర్భంగా సెంచరీ(అంతర్జాతీయ కెరీర్‌లో 71వది)తో పూర్వవైభవం పొందాడు కోహ్లి. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరో రెండు శతకాలు బాదాడు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లిపై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పడం, ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడం.. ఆ తర్వాత వరుస ఫార్మాట్ల నుంచి భారత కెప్టెన్ బాధ్యతల నుంచి ఉద్వాసన వంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నిలకడలేమి ఫామ్‌తో సతమతమయ్యాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో కొత్త సారథి ఎవరైనా అతడి నేతృత్వంలో ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నానని మేనేజ్‌మెంట్‌కు చెప్పాడట కోహ్లి. ఈ విషయం తెలిసిన డుప్లెసిస్ ఎగ్జైట్ అయ్యాడట.
ఆటే ముఖ్యం
ఆర్సీబీ పాడ్‌కాస్ట్ సీజన్ 2లో ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ కెప్టెన్సీ ప్రణాళికల గురించి నాకు తెలిసిన తర్వాత వెంటనే అతడికి మెసేజ్ చేశాను. నాకు తెలిసి నేనే మొదట అతడికి ఈ విషయం చెప్పానుకుంటా. తను చాలా సంతోషపడ్డాడు. అదే సమయంలో తన కెప్టెన్సీ నేను ఆడబోతున్నానని తెలిసి ఎగ్జైట్ అయ్యాడు.
సలహాలు ఇవ్వకపోవడమే మంచిది
గత సీజన్‌లో జరిగిన పరిణామాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. నిజానికి వ్యక్తుల కన్నా ఆటే అత్యుత్తమమైనది. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. కాబట్టి ఒక్కోసారి మనకు అప్పజెప్పిన బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత.. బాధపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మన స్థానంలోకి వచ్చిన వ్యక్తి మన సలహాలు, సూచనలు తీసుకోనని చెప్పినా చింతించాల్సిన పని లేదు. ఎవరూ అలా ఆలోచించొద్దు కూడా! అని కోహ్లి చెప్పుకొచ్చాడు.
కెప్టెన్‌గా వైదొలిగిన నిజాన్ని జీర్ణించుకునేందుకు సమయం పట్టిందని, అయితే, కొత్త సారథికి సూచనలు ఇవ్వాలన్న ప్రతిపాదన మాత్రం తనకు అంతగా నచ్చలేదని, ఎవరికైనా స్వేచ్ఛనిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment