
రాయ్‌పూర్: రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇండియా లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య లీగ్ మ్యాచ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (35 బంతుల్లో 80 పరుగులు: 10 ఫోర్లు, 5 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించాడు. వయసు పెరిగినా తనలో సత్తువ ఏ మాత్రం తగ్గలేదని సెహ్వాగ్ మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతినే బౌండరీగా మలిచిన వీరు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. బంతి పడిందే ఆలస్యం అన్నట్లుగా బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పాత సెహ్వాగ్‌ను గుర్తుకుతెచ్చాడు. వీరు విధ్వంసం దాటికి ఇండియన్ లెజెండ్స్ కేవలం 10.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. సెహ్వాగ్‌కు జతగా వచ్చిన ఓపెనర్ కమ్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 33 పరుగులతో అతనికి సహకరించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో నిజాముద్దీన్ 49 మినహా ఎవరు ఇండియా లెజెండ్స్ బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు. ఇక ఇండియన్ లెజెండ్స్ బౌలింగ్‌లో వినయ్ కుమార్, ప్రగ్యాన్ ఓజా, యువరాజ్‌లు తలా 2 వికెట్లు తీయగా..మన్‌ప్రీత్ గోని, యూసఫ్ పఠాన్ చెరొక వికెట్ తీశారు. 110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ సెహ్వాగ్ మెరుపులతో 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
చదవండి: ఆ జాబితాలో ఫించ్ కూడా చేరాడు..