శ్రీలంక నూతన కెప్టెన్‌గా హసరంగ..? | Wanindu Hasaranga Appointed As New Captain Of Sri Lanka In T20I? - Sakshi
Sakshi News home page

శ్రీలంక నూతన కెప్టెన్‌గా హసరంగ..?

Published Fri, Dec 29 2023 6:28 PM | Last Updated on Fri, Dec 29 2023 7:07 PM

Wanindu Hasaranga Appointed As New Captain Of Sri Lanka In T20I - Sakshi

శ్రీలంక టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా వనిందు హసరంగ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. లంక క్రికెట్‌ బోర్డు హసరంగ పేరు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆ దేశ మీడియా వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మరోవైపు లంక టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా దిముత్‌ కరుణరత్నే కొనసాగుతాడని శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టీ20 కెప్టెన్‌ను ప్రకటించేందుకు లంక బోర్డు సోమవారం మరో సమావేశంకానున్నట్లు తెలుస్తుంది.

ఆ రోజు హసరంగ పేరును ప్రకటించడం లాంఛనమేనని సమాచారం. హసరంగ.. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ లంక బోర్డు అతనిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఈ ఏడాది లంక ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా గాయపడి, అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో దుమ్మురేపిన హసరంగ.. గాయం కారణంగా ఆ తర్వాత జరిగిన ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2024 వేలంలో హసరంగను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. అంతకుముందు ఐపీఎల్‌ సీజన్‌ వరకు హసరంగ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించగా.. ఇటీవలే ఆ జట్టు ఇతన్ని వేలానికి వదిలిపెట్టింది. శ్రీలంక తమ తదుపరి సిరీస్‌ను వచ్చే ఏడాది 6 నుంచి స్వదేశంలో ఆడనుంది. సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం సోమవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20ల్లో గతకొంతకాలంగా దసున్‌ షనక లంక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఘోర ప్రదర్శన కనబర్చిన నేపథ్యంలోనే ఆ జట్టులో సమూల ప్రక్షాళన జరుగుతుంది. లంక క్రికెట్‌లో రాజకీయ పరమైన జోక్యం ఎక్కువ కావడంతో ఐసీసీ ఆ జట్టుపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement