ఒక క్రికెటర్ ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే అతనిపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ క్రికెటర్ పేరు కూడా మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులొచ్చి ఉంటాయి. అతని స్థానంలో ఎంతో మంది కొత్త క్రికెటర్లు వచ్చారు. కొందరు రాణిస్తే.. ఇంకొందరు కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితమయిన వాళ్లుంటారు. అలాంటి స్థితిలో అతని ఎంట్రీ గొప్పగా జరిగితే అంతకుమంచి ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అతని పేరు వాషింగ్టన్ సుందర్.
చదవండి: Mohammad Siraj: 'ఏంటో సిరాజ్.. నీ సెలబ్రేషన్స్‌తో భయపెడుతున్నావు'
వెస్టిండీస్‌తో తొలి వన్డే ద్వారా సుందర్ ఐదేళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చాడు. సుందర్ టీమిండియా తరపున 2017లోనే తొలి వన్డే ఆడాడు. అప్పుడు శ్రీలంకతో ఆడిన వన్డే అతనికి మొదటిది.. చివరిది కావడం విశేషం. ఈ ఐదేళ్లలో మళ్లీ వన్డే మ్యాచ్ ఆడని సుందర్‌కు వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ రెండోది మాత్రమే. తరచూ గాయాలు బారిన పడడం.. ఫిట్‌నెస్ సమస్యలు సుందర్‌ను చుట్టు ముట్టాయి.
అయితే తాజాగా రీఎంట్రీ ఇచ్చిన సుందర్ గోడకు కొట్టిన బంతిలా తయారయ్యాడు. తన బౌలింగ్ పవర్‌తోనే తానెంటో నిరూపించుకున్నాడు. సుందర్‌ను నమ్మిన రోహిత్ పవర్ ప్లేలో అతని చేతికి బంతిని ఇచ్చాడు. సుందర్ తన కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తే ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే వికెట్ తీశాడు. బ్రాండన్ కింగ్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. అదే ఓవర్ చివరి బంతికి డారెన్ బ్రావోను ఎల్బీగా వెనక్కి పంపాడు. అయితే తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడం.. రోహిత్ శర్మ రివ్య్వూకు వెళ్లడం.. ఫలితం సుందర్ ఖాతాలో రెండో వికెట్ పడింది. ఇక మ్యాచ్‌లో ఓవరాల్‌గా 9 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్‌ది ఘనమైన పునరాగమనం అనే చెప్పొచ్చు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల దాటికి 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2022: ఆర్సీబీకి ఎంపికైన కొత్తలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న కోహ్లి..
అయితే ఇదే వాషింగ్టన్ సుందర్‌కు టెస్టు అరంగేట్రం ఎవరు ఊహించని విధంగా జరిగింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు సుందర్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టు ద్వారా సుందర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ సాధించాడు. అయితే బ్యాటింగ్ సందర్భంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనప్పుడు సుందర్.. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది.
తొలి ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో పాటు శార్దూల్‌తో కలసి ఏడో వికెట్‌కు 127 పరుగులు జోడించడం హైలెట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా లక్ష్యచేధనలో విజృంభించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అలా సుందర్.. గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా సాధించిన విజయం వెనుక సుందర్ పాత్ర మరువలేం. ఓవరాల్‌గా 4 టెస్టులు ఆడిన సుందర్ 265 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment