మీరు చూశారా? తీవ్ర అసహనానికి గురైన అయ్యర్‌.. అంత కోపమెందుకో? | WC 2023: Troubled Me? You Guys Have Created - Shreyas Iyer Hits Back At Critics - Sakshi
Sakshi News home page

Shreyas Iyer: మీరు చూశారా? తీవ్ర అసహనానికి గురైన అయ్యర్‌.. ! ఎందుకంత కోపం?

Published Fri, Nov 3 2023 9:51 AM | Last Updated on Fri, Nov 3 2023 10:34 AM

WC 2023: Troubled Me You Guys Have Created That Shreyas Iyer Hits Back Critics - Sakshi

ICC WC 2023- Ind vs SL- Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన బ్యాటింగ్‌ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో అయ్యర్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే.

ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(92), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(88) టీమిండియా భారీ స్కోరుకు పునాది వేయగా.. అయ్యర్‌ ఆ పని పూర్తి చేశాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ నలువైపులా షాట్లు బాదుతూ చూడముచ్చటైన ఆటతో ఆకట్టుకున్నాడు.

ముంబై మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్‌ బ్యాటర్‌ 3 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో ఏకంగా 82 పరుగులు రాబట్టాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తనదైన షాట్లు బాదుతూ సొంతమైదానంలో ప్రేక్షకులకు కనువిందు చేశాడు శ్రేయస్‌ అయ్యర్‌.

గత మ్యాచ్‌లో 4 పరుగులకే అవుటై తీవ్ర విమర్శలపాలైన అతడు   గురువారం నాటి మ్యాచ్‌లో తిట్టిన నోళ్లతోనే ప్రశంసించేలా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలో లంకపై ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడిన శ్రేయస్‌ అయ్యర్‌కు.. ‘‘ఈ వరల్డ్‌కప్‌ ఆరంభం నుంచి షార్ట్‌బాల్‌ ఎదుర్కోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా?’’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. 

ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి?
ఈ ప్రశ్నను మధ్యలోనే కట్‌చేసిన అయ్యర్‌.. ‘‘షార్ట్‌బాల్స్‌ ఎదుర్కోవడం ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి? ’’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. అది సమస్య అని చెప్పడం లేదు కాదు.. ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నా అని సదరు జర్నలిస్టు పేర్కొన్నారు.

మీరు చూశారా? ఎందుకీ ప్రచారం?
దీంతో తీవ్ర అసహనానికి గురైన అయ్యర్‌.. ‘‘నేను ఎన్నిసార్లు పుల్‌షాట్లు ఆడాను.. ముఖ్యంగా ఆ తరహాలో ఎన్ని ఫోర్లు కొట్టాను మీరు చూశారా? బంతిని బాదాలని ఫిక్స్‌ అయితే.. అది షార్ట్‌బాలా లేక ఇంకేదైనానా అని చూడను. 

హిట్‌ చేయాలనుకుంటే చేస్తానంటే.. ఆ క్రమంలో ఓ రెండు మూడుసార్లు నేను బౌల్డ్‌ అయితే.. ఇక అప్పటి నుంచి.. ‘‘ఇతడు ఇన్‌స్వింగింగ్‌ బాల్‌ ఆడలేడు.. కట్‌ షాట్‌ ఆడలేడు..’’ అంటూ ప్రచారాలు మొదలుపెడతారా?

ఆటగాళ్లుగా పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలా ఆడాలో మాకు తెలుసు. కానీ మీరు ఇలా.. ‘‘అయ్యర్‌ షార్ట్‌ బాల్‌ ఆడలేడు’’ అంటూ ఇష్టారీతిన మీకు నచ్చినట్లు రాసేస్తారు. మిమ్మల్ని చూసి మరికొంత మంది ఇలాగే మాట్లాడతారు’’ అని కౌంటర్‌ ఇచ్చాడు.

నిజమే కదా!
నిజానికి అయ్యర్‌ షార్ట్‌ బంతులను ఎదుర్కోవడంలో గతంలో చాలాసార్లు విఫలమయ్యాడు. అయితే, వాంఖడేలో లంకతో మ్యాచ్‌లో మాత్రం షార్ట్‌ బంతులను కూడా షాట్లుగా మలిచాడు. ఈ నేపథ్యంలో తన ఆట తీరును సమర్థించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌.. ఇకపై ఇలాంటి ప్రచారాలు మానేయాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశాడు.

మీకు ఇబ్బంది.. నాకు కాదు
‘‘షార్ట్‌ బాల్స్‌ ఆడే క్రమంలో కొన్నిసార్లు అవుటైన కారణంగా మీరలా భావిస్తున్నారే తప్ప.. నాకు మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు’’ అని పేర్కొన్నాడు. అయితే, అయ్యర్‌ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. ‘వాస్తవాలు మాట్లాడితే అంత కోపమెందుకు అయ్యర్‌’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేసి టీమిండియా సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే.

చదవండి: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా: రోహిత్‌ శర్మ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement