రోహిత్, కోహ్లిలకే చుక్కలు చూపించాడు.. ఎవరీ హసన్ మహమూద్? | Who is Hasan Mahmud? Bangladeshi bowler who dismissed Virat Kohli And Rohit Sharma | Sakshi
Sakshi News home page

IND vs BAN: రోహిత్, కోహ్లిలకే చుక్కలు చూపించాడు.. ఎవరీ హసన్ మహమూద్?

Published Thu, Sep 19 2024 4:27 PM | Last Updated on Thu, Sep 19 2024 6:51 PM

Who is Hasan Mahmud? Bangladeshi bowler who dismissed Virat Kohli And Rohit Sharma

చెన్నై వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేస‌ర్ హసన్ మహమూద్ నిప్పులు చేరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో త‌న పేస్ బౌలింగ్‌తో భార‌త బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తిస్తున్నాడు. లంచ్ విరామానికి ముందు అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాలేదు. భీకరమైన బౌన్సర్లతో టీమిండియా ఆటగాళ్లును బోల్తా కొట్టించాడు.

ఆఖరికి విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, శుబ్‌మ‌న్ గిల్ వంటి స్టార్ ప్లేయ‌ర్ల సైతం అత‌డి బౌలింగ్ ముందు బ్యాట్లెత్తాశారు. అతడి దెబ్బకు 34  పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకున్న రిషబ్ పంత్‌ను సైతం మహముద్ పెవిలియన్‌కు పంపాడు.

ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 18 ఓవర్లు బౌలింగ్‌ చేసిన హసన్‌.. 58 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో భారత్‌ను ఆరంభంలోనే కష్టాల్లో నెట్టిన ఈ యువ పేసర్ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ఎవరీ హసన్ మహమూద్?
24 ఏళ్ల హసన్ మహమూద్ 1999, ఆక్టోబర్ 12న బంగ్లాదేశ్‌లోని లక్ష్మీపూర్‌లో జన్మించాడు.  మార్చి 2020లో మహమూద్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌తో మహమూద్ తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను ప్రారంభించాడు.

ఆ తర్వాత ఏడాదికే వన్డేల్లో వెస్టిండీస్‌పై హసన్ డెబ్యూ చేశాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో సత్తాచాటడంతో అతడికి బంగ్లా టెస్టు జ‌ట్టులో కూడా చోటు ద‌క్కింది. ఈ ఏడాది మొదట్లో శ్రీలంకపై టెస్టు క్రికెట్‌లోకి అతడు అడుగుపెట్టాడు. అ​క్కడ కూడా మహమూద్‌ అదరగొట్టాడు.

కాగా హసన్‌కు ఇది నాలుగో టెస్టు. ఇంతకుముందు కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన హసన్‌..13 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ మూడు మ్యాచ్‌ల్లో హసన్‌ 4 కంటే తక్కువ ఎకానమీ రేటును కలిగి ఉండడం గమనార్హం.

ఈ మ్యాచ్‌ కంటే ముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా హసన్‌ దుమ్ములేపాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. పాక్‌పై బంగ్లాదేశ్‌ చారిత్రత్మక టెస్టు సిరీస్‌ విజయం సాధించడంలో హసన్‌ది కీలక పాత్ర. 

కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్‌ చేయగలిగే సత్తా అతడికి ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్‌తో కలపునకుని అతడి ఖాతాలో 17 టెస్టు వికెట్లు ఉన్నాయి. అదే విధంగా వన్డేల్లో 30, టీ20ల్లో 18 వికెట్లు హసన్‌ పేరిట ఉన్నాయి.
చదవండి: IND vs BAN: చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూప‌ర్ సెంచ‌రీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement