పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్‌? | Who is Saurabh Netravalkar? Software Engineer turns Super Over hero | Sakshi
Sakshi News home page

T20 WC 2024: పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్‌?

Published Fri, Jun 7 2024 9:45 AM | Last Updated on Thu, Jun 13 2024 1:07 PM

Who is Saurabh Netravalkar? Software Engineer turns Super Over hero

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పెను సంచలనం నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా జట్టు పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో భాగంగా డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అమెరికా ఘన విజయం సాధించింది.

సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో పాక్‌ను అమెరికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌లో ఫలితాన్ని నిర్ణయించాల్సింది.

సూపర్ ఓవర్‌లో అమెరికా అదుర్స్‌..
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ సూపర్ ఓవర్ వేసిన పేసర్ మహ్మద్ అమీర్ ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 7 పరుగులివ్వడం గమనార్హం​. అనంత‌రం అమెరికా త‌ర‌పున సూప‌ర్ ఓవ‌ర్ బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు.

పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే..
ఇక పాకిస్తాన్‌ను ఓడించిన అమెరికా జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు నలుగురు ఉండటం గమనార్హం.  యూఎస్‌ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ వంటి ఆటగాళ్లు భారత మూలాలు ఉన్న క్రికెటర్లే.

అమెరికా విజయంలో మోనాంక్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో మోనాంక్ పటేల్(50) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు పేసర్‌ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నేత్రావల్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 18 ప‌రుగులిచ్చి 2 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. 
ఇక  మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు పాకిస్తాన్ మ్యాచ్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఇక అమెరికా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన మోనాంక్ పటేల్‌, సౌరభ్ నేత్రావల్కర్‌ల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

ఎవ‌రీ సౌరభ్ నేత్రావల్కర్‌?

సౌరభ్ నేత్రావల్కర్ ముంబైలో జ‌న్మించాడు.  32 ఏళ్ల సౌరభ్ 2010 అండర్-19 వరల్డ్ కప్​లో భారత్​కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ప్ర‌స్తుత భార‌త స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్‌తో క‌లిసి నేత్రావల్కర్ ఆడాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్‌లో ముంబైకు నేత్రావల్కర్ ప్రాతినిథ్యం వ‌హించాడు.

క్రికెట్‌లో పెద్దగా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఉద్యోగంపై దృష్టిసారించాడు. 2013లో ముంబై యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరభ్.. అనంతరం మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2016లో కార్నెల్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డ్రిగీ అందుకున్నాడు.

ఆ తర్వాత ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. కానీ క్రికెట్‌పై మక్కువ మాత్రం నేత్రావల్కర్‌కు పోలేదు. జాబ్ చేస్తుండగానే గల్ఫ్ జెయింట్స్,  సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడేవాడు. అనంతరం అమెరికా దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుండండంతో సీనియర్ జట్టులో చోటు దక్కింది.


 
ఎవ‌రీ మోనాంక్ పటేల్‌?
31 ఏళ్ల మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు. మోనాంక్ పటేల్ భారత్ వేదికగానే క్రికెట్ వైపు అడుగులు వేశాడు.  మోనాంక్ గుజరాత్ తరపున ఏజ్-గ్రూప్ క్రికెట్ ఆడాడు. అదే విధంగా గుజరాత్ అండర్‌-19 జట్టుకు కూడా పటేల్ ప్రాతినిథ్యం వహించాడు.

ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చిన మోనాంక్‌.. ఆ దేశం తరపున ప్రొఫిషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అత‌డు తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అమెరికా క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు.

క్వాలిఫైయర్స్ ఒమన్‌తో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో మోనాంక్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. అక్క‌డ నుంచి ప‌టేల్ వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఈ క్ర‌మంలోనే స్టీవ‌న్ టేల‌ర్ నుంచి అమెరికా జ‌ట్టు ప‌గ్గాల‌ను మోనాంక్ ప‌టేల్ సొంతం చేసుకున్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement