WI VS ZIM 1st Test: 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ (137 నాటౌట్) అజేయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో బ్యాలెన్స్ పలు అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే శతకం బాదిన 24వ క్రికెటర్‌గా, రెండు దేశాల తరఫున సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా (కెప్లర్ వెసెల్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తరఫున) రికార్డు పుటల్లోకెక్కాడు. బ్యాలెన్స్ ఈ రికార్డులు సాధించే క్రమంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
జింబాబ్వేలోనే పుట్టి పెరిగిన బ్యాలెన్స్ తొలుత తన సొంత దేశం తరఫున కాకుండా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేల్లో 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున అవకాశాలు రాకపోవడంతో సొంత గూటికి చేరుకున్న బ్యాలెన్స్ అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ బాదాడు.
ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. బ్యాలెన్స్ 8 ఏళ్ల కిందట తన చివరి టెస్ట్ సెంచరీని వెస్టిండీస్‌పైనే సాధించాడు. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టులో శివ్‌నరైన్ చంద్రపాల్ ఉండగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ సెంచరీ బాదిన మ్యాచ్‌లో శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ చంద్రపాల్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్ అజేయమైన డబుల్ సెంచరీ బాది తన తండ్రి అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ను అధిగమించాడు.
ఇదిలా ఉంటే, విండీస్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. ఆట చివరి రోజు విండీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. జింబాబ్వే 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఆటలో చివరి సెషన్ మాత్రమే మిగిలింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టం. గ్యారీ బ్యాలెన్స్ (10), తఫడ్జా సిగా (10) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 447 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్ చంద్రపాల్ అజేయమైన 207 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 182 రన్స్ చేశాడు.
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాలెన్స్ సెంచరీ చేయగా.. బ్రాండన్ మవుటా (56) అర్ధ శతకంతో రాణించాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో రీఫర్ (58), బ్లాక్‌వుడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో చాము చిబాబా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment