WTC FINAL IND VS AUS: టీమిండియా మేనేజ్‌మెంట్ అగ్రశ్రేణి స్పిన్నర్ అశ్విన్‌ను తుది జట్టులో నుంచి తప్పించి తగిన మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన అశ్విన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని గైర్హాజరీలో ఆసీస్ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ముఖ్యంగా ట్రవిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) టీమిండియా బౌలర్లను ఆటాడుకున్నారు. ఫలితంగా తొలి రోజే ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. ఇదే పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగితే టీమిండియా విజయావకాశాలకు గండిపడవచ్చు.
కాగా, అశ్విన్‌కు తుది జట్టులో స్థానంపై మ్యాచ్ ముందు రోజు కెప్టెన్ రోహిత్ శర్మ సందేహం వ్యక్తం చేయగా, చివరకు అదే జరిగింది. ‘పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని’ అశ్విన్‌ను ఆడించడం లేదని, బాధగా ఉన్నా తప్పట్లేదని రోహిత్ అన్నాడు. అయితే తొలిరోజు భారత బౌలర్ల ప్రదర్శనను చూసిన తర్వాత అశ్విన్ లేని లోటు కనిపించింది.
ఆరంభంలో కొద్దిసేపు మాత్రమే పిచ్‌పై తేమ ఉండి ఆ తర్వాత అంతా సాధారణంగా మారిపోయింది. పరిస్థితుల విషయంలో భారత్ అంచనా తప్పిందని మాజీ క్రికెటర్లు పాంటింగ్, హాడిన్, మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు అద్భుత రికార్డు ఉండటంతోపాటు ఆ జట్టు టాప్–7లో నలుగురు ఎడంచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. పిచ్ ఎలా ఉన్నా అతను కచ్చితంగా ప్రభావం చూపేవాడని వారు విశ్లేషించారు.
మ్యాచ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం మరోలా ఆలోచించి నలుగురు పేసర్లకు అవకాశం కల్పించింది. మరోవైపు జడేజా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో ఆడగా, కివీస్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. పరిస్థితులన్నీ పేస్ బౌలింగ్‌కు అనుకూలించాయి. అప్పుడు ‘పొరపాటు’ చేసినట్లుగా గుర్తించిన జట్టు ఈసారి దానిని సరిదిద్దుకోబోయే మరో పొరపాటు చేసినట్లుంది!
చదవండి: తొలి రోజే ‘తల’పోటు...
Comments
Please login to add a commentAdd a comment