వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో సెంచరీ చేసి, ఐసీసీ టెస్ట్ ఫార్మాట్ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ట్రవిస్ హెడ్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హెడ్ సెంచరీ చేసిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు హెడ్ ఎదురుదాడికి దిగి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన తీరును అందరూ కొనియాడుతున్నారు.
నిలకడగా ఆడటమే కాకుండా వేగంగా పరుగులు చేసిన విధానాన్ని ఆకాశానికెత్తుతున్నారు. తొలి రోజు టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన హెడ్.. ఆట ముగిసే సమయానికి 156 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 146 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. ఫలితంగా ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.
కాగా, హెడ్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై ఆడిన లాంటి ఇన్నింగ్స్‌లు కెరీర్‌లో చాలా ఆడాడు. కెరీర్‌లో 36 టెస్ట్‌లు ఆడిన హెడ్.. తాను చేసిన 5 సెంచరీల్లో 3 జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సాధించినవే.
2021లో గబ్బా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు స్కోర్ 195/5 వద్ద బరిలోకి దిగిన హెడ్.. 85 బంతుల్లో మెరుపు శతకం చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
2022లో హోబర్ట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు స్కోర్ 12/3 వద్ద బరిలోకి దిగిన హెడ్.. 112 బంతుల్లో శతకం బాది ఆసీస్‌ను గెలిపించాడు.
2022లో గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జట్టు స్కోర్ 27/3 వద్ద ఉండగా బరిలోకి దిగిన హెడ్.. 96 బంతుల్లో 92 పరుగులు చేసి తన జట్టును విజయపథంలో నడిపించాడు.
తాజాగా ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టు స్కోర్ 76/3 వద్ద ఉండగా బరిలోకి దిగిన హెడ్.. మెరుపు దాడే లక్ష్యంగా ఆడి 106 బంతుల్లో శతక్కొట్టాడు.
ఇవే కాక, ఈ ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (59 బంతుల్లో 70).. 2022 డిసెంబర్‌లో విండీస్‌తో జరిగిన టెస్ట్‌లో భారీ శతకం (175), ఇదే సిరీస్‌లో అంతకుముందు టెస్ట్‌లో 95 బంతుల్లో 99 పరుగుల ఇన్నింగ్స్ హెడ్ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచాయి. హెడ్ టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన 4 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందిందంటే, ఆ జట్టు విజయాల్లో అతని పాత్ర ఏంటో అర్ధమవుతుంది.
చదవండి: అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో తొలి సెంచరీలు చేసింది ఎవరు..?
Comments
Please login to add a commentAdd a comment