పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో యాసిర్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాసిర్ షా ఐదో స్థానానికి చేరుకున్నాడు. లంక సీనియర్ బ్యాట్స్‌మన్ ఏంజెల్లో మాథ్యూస్‌ను ఔట్ చేయడం ద్వారా యాసిర్ టెస్టుల్లో 237వ వికెట్‌ను దక్కించుకున్నాడు.
తద్వారా అబ్దుల్ ఖాదీర్(236 వికెట్లు)ను దాటిన యాసిర్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక యాసిర్ షా కంటే ముందు పాక్ దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్(414 వికెట్లు), వకార్ యూనిస్(373 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్(362 వికెట్లు), దానిష్ కనేరియా(261) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఇక యాసిర్ షా పాకిస్తాన్ క్రికెట్‌లో పెను సంచలనం. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
►2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యాసిర్ షా పాకిస్తాన్ తరపున 50 వికెట్లు అత్యంత వేగంగా తీసిన బౌలర్‌గా నిలిచాడు.
►టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని(17 టెస్టుల్లో 100 వికెట్లు) అందుకున్న ఆటగాడిగా మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.
►200 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా యాసిర్ షా చరిత్ర. 33 టెస్టుల్లో యాసిర్ 200 వికెట్లు సాధించాడు. అంతకముందు ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్(36 టెస్టుల్లో 200 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది.
►ఇప్పటివరకు యాసిర్ షా పాకిస్తాన్ తరపున 47 టెస్టుల్లో 237 వికెట్లు, 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్‌ను 16 సార్లు అందుకున్నాడు.
ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్న యాసిర్ షా లంకతో టెస్టులో మంచి ప్రదర్శననే ఇచ్చాడు. 21 ఓవర్లు వేసిన యాసిర్ షా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. అజర్ అలీ (3), బాబర్ ఆజం(1) క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ అయింది. చండీమల్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహీస్ తీక్షణ 38 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. యాసిర్ షా, హసన్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment