
మాజీ ఎమ్మెల్యే కొమ్మిని, చంద్రారెడ్డిని అడ్డుకుంటున్న యువగళం టీం
ఆత్మకూరు: నలుగురు వ్యక్తులు, నాలుగు నెలలుగా టీడీపీని పాడైపె పండబెట్టి మోస్తున్నారని, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు స్థానిక టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు అల్లీపురంలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం జరిగింది. భువనేశ్వరి ప్రకటించిన షెడ్యూల్ కన్నా ముందుగానే.. ఇటీవల మృతిచెందిన టీడీపీ కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి ఇంటికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమం కోసం తెలుగు తమ్ముళ్లు రహదారి వెంట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేవలం ఆనం రామనారాయణరెడ్డి ఫొటోలు, స్థానిక టీడీపీ నాయకుల ఫొటోలు మాత్రమే ఉండడంతో దీనిపై మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు మండిపడ్డారు. తనతోపాటు మరో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, పార్టీ అధికార ప్రతినిధి గూటూరు మురళీ కన్నబాబు ఫొటోలు, పేర్లు లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి.చంద్రారెడ్డి, కౌన్సిలర్ మాదాల శ్రీనివాసులునాయుడు, మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు తదితరులను నిలదీశారు.
ఆనంను అభ్యర్థిగా ప్రకటించారా ?
ఆనంను అధిష్టానం ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించిందా.. మీకేమైనా అలాంటి సమాచారం ఎవరైనా చెప్పారా.. ఎందుకు ఆయన ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ స్థానిక టీడీపీ నేతలను కొమ్మి ప్రశ్నించారు. దీంతో వారు అక్కడి నుంచి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. కనీసం సీనియర్ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను పట్టించుకొనే పరిస్థితి లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం భువనేశ్వరి పరామర్శించేందుకు వెళ్లిన ఇంట్లోకి కొమ్మి లక్ష్మయ్యనాయుడుతోపాటు మరో నాయకుడు చంద్రారెడ్డి వెళ్లబోతుండగా, యువగళం పాదయాత్ర టీము వారిని అడ్డుకున్నారు. దీంతో కొమ్మి తాను మాజీ ఎమ్మెల్యేనని, ఎవరు చెబితే మీరు నన్ను అనుమతించడం లేదంటూ నిలదీశారు. దీంతో వారు ఆయనను లోపలికి అనుమతించారు. అయితే చంద్రారెడ్డిని మాత్రం అనుమతించకపోవడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో చంద్రారెడ్డిని కూడా ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించారు.