No Headline
కావలి: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను మత్స్యకారులకు అంకితం చేయడంలో కూటమి సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. మత్స్యకారులకు పెద్దబోట్లు సరఫరా చేసి హార్బర్‌ను వినియోగంలోకి తీసుకురావాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా అంతర్భాగమైన కందుకూరు నియోజకవర్గంతో కలిపి 189 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో మత్స్యకారుల జనాభా సుమారు 4 లక్షలు. వీరిలో ప్రత్యక్షంగా సముద్రం మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల సంఖ్య 50,000. వీరికి 8,500 ఫైబర్ బోట్లు, 4,500 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి.
తమిళ కార్పొరేట్ శక్తుల తిష్ట
సముద్రంలోకి కార్పొరేట్లు రంగ ప్రవేశం చేశారు. దీంతో చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. పెరిగిన పోటీ కారణంగా సంప్రదాయ బోట్లతో వేట సాధ్యపడడం లేదు. ఎక్కడైతే మత్స్యకారులు స్వేచ్ఛగా జీవనం సాగించారో అక్కడే కూలీలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తమిళనాడుకు చెందిన కార్పొరేట్ శక్తులు రూ.కోట్ల పెట్టుబడి, భారీ బోట్లతో రంగ ప్రవేశం చేశాయి. వలల సైజు మార్చి, సముద్రాన్ని ఊడ్చేయడం మొదలు పెట్టాయి. వీటన్నింటి ఫలితంగా చిన్న మత్స్యకారులు మామూలు బోట్లలో వేటకు వెళ్లినా చేపలు దొరకని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ వద్ద బకింగ్‌హాం కెనాల్ ఉంది. దానిపై 7 మీటర్లు వెడల్పులో చిన్న దారి ఉంది. ఈ కొద్దిపాటి ఇరుకు దారి హార్బర్‌కు రాకపోకలకు అనువుగా లేదు. అందుకే బకింగ్‌హామ్ కెనాల్‌పై 40 మీటర్ల వెడల్పుతో మరో వంతెన నిర్మించాలి. దానికి కనీసం రూ.30 కోట్లు ఖర్చవుతుంది. ఆ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేని పరిస్థితి. అలాగే హార్బర్‌కు ఉత్తరం వైపు రూ.5 కోట్లతో రోడ్డును కూడా నిర్మించాల్సి ఉంది.
నిర్వహణ కమిటీల
ఏర్పాటుకు సన్నాహాలు
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బోట్ల యజమానులు, చేపల వ్యాపారస్తులు, చేపలు ఎండబెట్టే మహిళలతో కమిటీలు వేసి హార్బర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. హార్బర్‌లో నిలిచే బోట్ల నుంచి వసూలు చేయాల్సిన ఫీజులు ఎంత అనేది నిర్ధారించడానికి ఇతర ఫిషింగ్ హార్బర్‌ల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాం.
– ఎం.నాగేశ్వరరావు, జేడీ,
జిల్లా మత్స్యశాఖ, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment