లక్ష పదినాల కల్పనే లక్ష్యం
● డ్వామా పీడీ గంగా భవాని
నెల్లూరు (పొగతోట): ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి రోజూ లక్ష మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ గంగా భవాని ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఓలను ఆదేశించారు. శుక్రవారం డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రూపుల ఏర్పాటు రెండు రోజుల్లో పూర్తి చేసి ఉపాధి పనుల లక్ష్యాన్ని చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. మేట్లను నియమించడం వల్ల ఎఫ్‌ఏలు లేని ప్రాంతాల్లో సమస్య తగ్గుతుందన్నారు. గోకులాల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి, ఫిబ్రవరి మొదటి వారంలోపు బిల్లులను అప్‌లోడ్ చేయాలని సూచించారు.
లింగ నిర్ధారణ చేస్తే
కఠిన చర్యలు
● డీఎంహెచ్‌ఓ సుజాత
నెల్లూరు(అర్బన్): స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేసినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ సుజాత హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ భ్రూణ హత్యలను నివారించడం కోసమే లింగనిర్ధారణ పరీక్షపై ఆంక్షలు విధిస్తూ చట్టం వచ్చిందన్నారు. సీ్త్ర, పురుష నిష్పత్తి సమతుల్యం కావాలన్నారు. జిల్లాలో ప్రతి 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నారన్నారు. స్కానింగ్ సెంటర్లపై ఆకస్మికంగా డెకోయ్ ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. బాల్యవివాహాలు నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ సర్ధార్‌సుల్తానా, డాక్టర్ కిరణ్, అనాటమి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణరెడ్డి, డివిజనల్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ దయాకర్, ఎన్‌జీఓలు కవితారెడ్డి, శ్రీనివాసరావు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్
కార్యాలయాలు కిటకిట
● నేటి నుంచి మార్కెట్ విలువ
పెంపు దృష్ట్యా క్యూ కట్టిన జనం
● జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజే
750పైగా రిజిస్ట్రేషన్లు
● రాత్రి 9 గంటల వరకు
కొనసాగిన ప్రక్రియ
నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి మార్కెట్ విలువలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న దృష్ట్యా జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శుక్రవారం రాత్రి వరకు కిటకిటలాడాయి. జిల్లాలో శనివారం నుంచి ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 50 శాతం వరకు భూమి విలువ పెరగనుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా క్రయవిక్రయదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు క్యూకట్టారు. గురువారం సర్వర్లు మొరాయించడంతో పలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో శుక్రవారం భారీగా జనం తరలిరావడంతో కార్యాలయాల్లో రద్దీ నెలకొంది.
ఒక్క రోజులో 750 పైగా రిజిస్ట్రేషన్లు
జిల్లాలో సాధారణంగా సగటున రోజుకు 200 నుంచి 300 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే శుక్రవారం ఒక్క రోజే 750కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. నెల్లూరు నగరం, కావలి పట్టణా ల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. అయితే పలు కార్యాలయాల్లో రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది.
మొరాయించిన సర్వర్లు
రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు భారీగా జరగడంతో సర్వర్ల్‌పై ప్రభావం చూపింది. దీంతో జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్లు శుక్రవారం కూడా పలు దఫాలుగా మొరాయించడంతో గంటల తరబడి జనం పడిగాపులు కాయాల్సి వచ్చింది. కేవైసీ, ఈ సైన్‌లు పలుమార్లు జరగకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment