ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి
● భయపడినట్లుగానే ధాన్యం ధరలు పతనం
చంద్రబాబు పాలన అంటేనే.. అన్నదాతలకు హడల్. రైతులు ముందే భయపడినట్లే ధాన్యం ధరలు దారుణంగా పతనం అయ్యాయి. గత సీజన్ వరకు ధాన్యాన్ని నిలబెట్టి డిమాండ్‌గా అమ్ముకున్నారు. ఈ సీజన్ నాటికి టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండడంతో రైతుల పాలిట శాపంగా మారింది. గతేడాదికి ఈ ఏడాదికి సగానికి సగం ధర దిగజారిపోవడం చూస్తే రైతులపై టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వం ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఇతర జిల్లాల మిల్లర్లను రప్పించి డిమాండ్ పెంచింది. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా మిల్లర్ల దోపిడీకి మద్దతుగా నిలుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరలు కల్పించలేమన్నట్లుగా ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటనతో స్పష్టమైంది.
● చేతులెత్తేసిన మంత్రి నాదెండ్ల
● ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,320, సాధారణ రకం రూ.2,300
● మద్దతు ధర కల్పన.. ప్రకటనలకే పరిమితం
● గత సీజన్‌లో బీపీటీ పుట్టి
రూ.28 వేలకు పైగా విక్రయం
● ప్రస్తుతం రూ.15 వేల నుంచి
రూ.16 వేలు మాత్రమే
● ఇతర జిల్లాల మిల్లర్లను రప్పించి డిమాండ్ పెంచిన గత ప్రభుత్వం
● ఊరూరా అన్నదాతల ఆక్రందనలు
నెల్లూరు (పొగతోట): జిల్లాలో ధాన్యం దిగుబడులు, ధరలు అన్నదాతలను హతాశులను చేస్తోంది. కరువు కాటకాలు, విపత్తులు, అకాల వర్షాలను అధిగమించి సాగు చేస్తే.. ప్రకృతి శాపమో, పాలకుడి పాదమో తెలియదు కానీ దిగుబడులు తగ్గాయి. ధరలు పతనమయ్యాయి. ఎటు చూసినా అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ప్రకృతి సహకరించక ధాన్యం దిగుబడులు తగ్గి రైతులు ఆందోళనకు గురవుతుంటే మరో పక్క రైస్ మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క ధరలు తగ్గించి రైతుల నడ్డి విరుస్తున్నారు. అధికారులు చెబుతున్న పరిస్థితులకు, వాస్తవానికి పొంతన లేకుండా ఉంది.
గతేడాది రూ.28 వేలు.. ఇప్పుడు రూ.16 వేలు
ప్రస్తుత టీడీపీ పాలనలో రైతులకు ‘మద్దతు’ దక్కడం లేదు. మిల్లర్ల దోపిడీకే ‘మద్దతు’ లభిస్తోంది. ధాన్యానికి అధికారికంగా ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,320 (పుట్టి రూ.19604) సాధారణ రకం రూ.2,300 (పుట్టి రూ.19,435) మద్దతు ధర ప్రకటించినా.. ప్రస్తుతం బీపీటీలను పుట్టి రూ.15 వేల నుంచి రూ.16 వేలకే రైస్‌మిల్లర్లు, దళారులు కుమ్మక్కై కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో పుట్టి ధాన్యం ఊహించని విధంగా పుట్టి ధాన్యం బీపీటీ రకం రూ.27 వేల నుంచి రూ.28 వేలకు ధరలు పలికాయి. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రకటించిన ‘మద్దతు’ రైతులకా? మిల్లర్లకా? అనేది స్పష్టమవుతోంది.
ప్రకృతి శాపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం
ఈ ఏడాది ప్రకృతి శాపం.. ప్రభుత్వం నిర్లక్ష్యం వెరసి అన్నదాతలకు ప్రాణసంకటకంగా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ధాన్యం ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 3,57,500 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. అయితే మంచు అధికంగా కురవడం, చలి ఎక్కువ కాలం ఉండడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వరి దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు ధాన్యం ధరలు కూడా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వరి కోతలు ఊపందుకున్నాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పుట్టికి రూ.12 వేల వరకు నష్టపోతున్నారు. జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వ పెద్దలకు పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ చెబుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో కనీస ధరలు అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మద్దతు ధర కల్పిస్తామంటూనే.. ఈ సారికి మా ప్రభుత్వంపై కనికరం చూపాలంటూ రైతు సంఘాల నేతలను బతిమిలాడుకోవడం చూస్తే పరిస్థితి అర్థమవుతోంది.
రైతులను
పట్టించుకోవడం లేదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది అధిక వర్షాలు, విపరీతమైన మంచు కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. నాటిన నెల రోజుల లోపే వెన్ను తీసింది. ఎకరాకు 40 నుంచి 50 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా, 20 నుంచి 25 బస్తాలకు పడిపోయింది. ఈ ఏడాది రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
– రావి మాల్యాద్రి,
సీపీఎం నాయకుడు, జలదంకి
ధాన్యం ధరలు
ఆశాజనకంగా లేవు
ఈ ఏడాది వరి సాగు నుంచి ధాన్యం విక్రయం వరకు ఇబ్బందులే. ధాన్యం ధరలు కూడా ఆశాజనకంగా లేవు. గతేడాది పుట్టి వరి కోతల సమయంలో రూ.24 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.18,000 కూడా కొనుగోలు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరుతో బస్తాకు 3 నుంచి 5 కేజీల తరుగు తీస్తున్నారు. ఈ ఏడాది దిగుబడులు కూడా తగ్గాయి.
– వాకా శ్రీనివాసులురెడ్డి, రైతు
● కలెక్టర్ ఆనంద్‌కు రైతుల విజ్ఞప్తి
పొదలకూరు: వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని మండలానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ ఓ ఆనంద్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ మండలంలోని మహ్మదాపురం గ్రామానికి రావడంతో అక్కడి రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు మాట్లాడుతూ రబీలో పండించిన ధాన్యం దిగుబడి దారుణంగా ఉందని, దీనికితోడు ధరలు గిట్టుబాటు కావడం లేదన్నారు. కళ్లాల్లో మిల్లర్లు కేఎన్‌ఎం 1638 రకం ధాన్యాన్ని రూ.17,500 కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి ఎకరాకు 2 నుంచి 2.50 పుట్లు ధాన్యం మాత్రమే దిగుబడి అవుతోందని రైతుకు మిగిలేదేమి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యంలో 22 నుంచి 23 తేమ శాతం వస్తుందని, అధికంగా ఉంటే మిల్లర్లకు తరుగు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గతేడాది ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని, ప్రస్తుతం ఇంకా కేంద్రం తెరవలేదన్నారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించాల్సిందిగా కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుంటే సమస్య ఉండదన్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉండేలా రైతులు చూసుకోవాలన్నారు.
గతంలో మద్దతు ధరలు అమలు
వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే అధికంగా వస్తే రైతులు బయటకు అమ్ముకునే విధంగా అవకాశం కల్పించింది. ప్రతి రైస్‌మిల్లర్ ఆర్‌బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలనే నిబంధనలు పెట్టింది. అప్పటి జిల్లా అధికార యంత్రాంగం రైస్ మిల్లర్లను దగ్గరకు రానివ్వకుండా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు తదితర జిల్లాల రైస్ మిల్లర్లను ఆహ్వానించారు. దీంతో ధాన్యానికి డిమాండ్ పెంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఎంత మద్దతు ధర ప్రకటించిందో అంతే ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. మార్కెట్‌లో బీపీటీ, నెల్లూరు మసూర, ఇతర రకాలకు డిమాండ్ అధికంగా ఉంది. వైఎస్సార్‌సీపీ పాలనలో పుట్టి రూ.27 వేల నుంచి రూ.28 వేల వరకు కొనుగోలు చేశారు.
మద్దతు ధర కల్పించేలా చర్యలు
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. ధరలు తగ్గించిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులు బహిరంగ మార్కెట్లో ధరలు అధికంగా ఉంటే అక్కడ విక్రయించుకోవచ్చు.
– అంకయ్య, డీఎస్‌ఓ
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించండి
Comments
Please login to add a commentAdd a comment