కప్పం కడితే సక్రమం.. లేదంటే అక్రమం | - | Sakshi
Sakshi News home page

కప్పం కడితే సక్రమం.. లేదంటే అక్రమం

Published Thu, Feb 27 2025 12:38 AM | Last Updated on Thu, Feb 27 2025 12:37 AM

కప్పం

కప్పం కడితే సక్రమం.. లేదంటే అక్రమం

కోవూరులో అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన లేఅవుట్‌

కోవూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల దోపిడీకి, దాష్టీకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక్కో వ్యాపారానికి ఒక్కో మాఫియా తయారైంది. ఇసుక, కోళ్ల వ్యర్థాలు, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, పేకాట, మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగిపోతున్న తమ్ముళ్లు చివరకు పశువుల వ్యాపారంతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తాజాగా రియల్‌ వెంచర్లపై పడి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అన్నీ అనుమతులతో ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వెంచర్ల యజమానులను వాటాలివ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

పాత లేఅవుట్ల యజమానులకు

షాడో ఎమ్మెల్యే హుకుం

రూ.10 లక్షలు కట్టి రసీదు

తీసుకోమంటున్న తమ్ముళ్లు

గతంలోనే అన్ని అనుమతులు తీసుకుని ప్లాట్లు వేసిన యజమానులు

వీరి తీరుతో రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌

కోవూరు: ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు, షాడో ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు. కప్పం కడితే సక్రమం లేదంటే.. అక్రమం చేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతి వ్యాపారాన్ని మాఫియాగా మార్చుకుని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. సహజ వనరుల నుంచి అసహజ వ్యాపారాల మాఫియాలకు అండగా ఉంటూ దోచుకుతుంటున్న తమ్ముళ్లు తాజాగా రియల్‌ వెంచర్లపై కన్నేశారు. పాత వెంచర్లకు నోటీసులు పేరుతో రూ.లక్షల్లో వసూళ్లకు తెర తీస్తున్నారు. గతంలో అనుమతులు పొంది ప్లాట్లు విక్రయించుకున్న యజమానులకు షాడోలు ఫోన్లు చేసి బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటికే ఆయా వెంచర్లలో ప్లాట్ల కొనుగోలు చేసిన యజమానులు గృహాలు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నారు. వారికి సైతం నోటీసులు జారీ చేయించి నరకం చూపిస్తున్నారు.

రూ.కోట్ల దండుకునే కుట్ర..

కోవూరు పంచాయతీ పరిధి శివారు ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో దాదాపు 10 వెంచర్లు పంచాయతీ అనుమతులతో లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఆ మేరకు డీటీసీపీ అనుమతులు కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఆయా లేఅవుట్లలో గృహాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఆయా వెంచర్లకు అనుమతులు లేవంటూ పంచాయతీ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. తాజా పరిణామాలతో గృహ నిర్మాణదారులు భయపడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుంటే ఇప్పుడు అనుమతుల పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆయా వెంచర్ల యజమానులతోపాటు ప్లాట్ల యజమానులను బెదిరించి రూ.కోట్ల దండుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

రద్దు చేయిస్తామంటే...

అనుమతులున్నట్లే కదా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు దండుకోవడమే పరమావధిగా పెట్టుకుని దోచుకుంటున్నారు. గతంలోనే ఏర్పాటు చేసిన లేఅవుట్లకు రూ.10 లక్షల ముడుపులుగా ఇవ్వాలని నాయకులు డిమాండ్‌ చేస్తుంటే, అంతే మొత్తం మాకు ఇవ్వాలంటూ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు డిమాండ్‌ చేస్తున్నారని, లేదంటే అనుమతులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని, అన్ని నిబంధనల ప్రకారమే డబ్బులు చెల్లించామని, మళ్లీ ఇప్పుడు ఇవ్వాలంటే ఎలా అని యజమానులు వాపోతున్నారు. పంచాయతీ అనుమతులు రద్దు చేయిస్తామంటే వాటికి అనుమతులు ఉన్నట్లే కదా? మేమెక్కడ అక్రమంగా లేఅవుట్లు వేశామంటూ వెంచర్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ అధికారుల దోపిడీ మామూలుగా లేదు. డీటీసీపీ అనుమతులు లేవంటూ అందుకు మరో రూ.5 లక్షల ఇవ్వాలంటూ పంచాయతీ కార్యదర్శి ఓపెన్‌గానే డిమాండ్‌ చేయడం గమనార్హం. ఈ విధంగా టీడీపీ నేతలు, పంచాయతీ అధికారులు ఎడాపెడా దోపిడీతో రియల్‌ వెంచర్ల యజమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు కూడా ప్రస్తుతం ఇల్లు కట్టలేమంటూ వాయిదా వేసుకుంటున్నారు.

లోకాయుక్తకు ఫిర్యాదు చేయించి

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నేతలు వెంచర్లపై కన్నేశారు. యజమానులను బెదిరించి ప్రతి లేఅవుట్‌కు అడిగినంత ఇవ్వాలని లేదంటే ఆయా లేఅవుట్ల అనమతులు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. వెంచర్ల యజమానులు సమాధానం చెప్పకపోవడంతో నాయకులు తమకు అనుకూలంగా ఉండే హైదరాబాద్‌లో ఉంటున్న వ్యక్తితో లోకాయక్తలో ఫిర్యాదు చేయించారు. విచారించి నివేదిక ఇవ్వాలనే లోకాయుక్త ఆదేశాలను పట్టుకుని నాయకుల నుంచి అధికారుల వరకు ఒక్కో లేఅవుట్‌కు రూ.10 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయా లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకుందామంటే అనుమతులకు టీడీపీ నేతల నుంచి అధికారుల వరకు అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఎవరైనా కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్లాట్లు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంచర్లలో ప్లాట్లు అమ్ముకోలేక పెట్టుబడులు వడ్డీలు రాక యజమానులు అప్పుల పాలవుతున్నారు.

నిబంధనల ప్రకారమే లేఅవుట్లు

కోవూరు పంచాయతీ పరిధిలో వేసిన లేఅవుట్లను నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేశారు. నుడా నిబంధనల ప్రకారమే రోడ్లు, ప్రజాప్రయోజనాల అవసరార్థం స్థలాల కేటాయింపు ఆయా లేఅవుట్లలో జరిగాయి. దీనికంటే ముందు వ్యవసాయ భూములను కమర్షియల్‌ భూములుగా కన్వెర్షన్‌ ప్రక్రియ కూడా సక్రమంగా జరిగింది. అందుకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చార్జీలను యజమానులు చెల్లించారు. ఇక లేఅవుట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా పంచాయతీకి చెల్లించాల్సిన బెటర్‌మెంట్‌ చార్జీలను కూడా చెల్లించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కప్పం కడితే సక్రమం.. లేదంటే అక్రమం 1
1/1

కప్పం కడితే సక్రమం.. లేదంటే అక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement