నెల్లూరు (పొగతోట): మాజీమంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటి వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరించారు. పార్టీ జిల్లా కార్యాలయం కాకాణి నివాసానికి సమీపంలో ఉండడంతో కార్యాలయం చుట్టూ, కాకాణి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీలోని రుస్తుం మైన్‌లో గత ప్రభుత్వంలో అక్రమంగా తెల్ల రాయిని తరలించారని ఫిబ్రవరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో కాకాణిని ఏ–4గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి కాకాణిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పోలీసులు మఫ్టీలో తిరుగుతూ కాకాణి నివాసం వద్ద పరిస్థితిని తెలుసుకుంటున్నారు.