నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం
నాటకాలంటే పిచ్చి
నాటకాలంటే పిచ్చి. దశాబ్దాలు నాటకాలు ఆడినా పూట గడవడం కష్టంగా మారింది. ఆ రంగాన్ని ఆదరించే వారు లేకపోవడంతో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నా. ఇప్పటికీ అడపాదడపా నాటకాలాడే ఓపిక ఉంది.
– బాబూరావు, నటుడు, బిరదవోలు
ఆదరణ లేదు
నాటక రంగానికి ఆదరణ కరువైంది. సాంఘిక, పౌరాణిక నాటకాలు ఆడేవాడిని. ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నా. టీవీ షోలు, కామిడీ పేరుతో జుగుప్సాకరమైన షోలు తిలకించేందుకే కొందరు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి తరానికి నాటక రంగం గురించి తెలియకపోవడం విచారకరం.
– కె.కోటేశ్వరరావు, రంగస్థల నటుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు, పొదలకూరు
● నాటక రంగంలో పొదలకూరుకు
ఘన చరిత్ర
● మారిన పరిస్థితులతో తెరమరుగు
● ఒకప్పటి పౌరాణిక నట దిగ్గజం బాబూరావు
● ప్రస్తుతం పురోహితుడిగా జీవనం
●
పొదలకూరు: టీవీ, సినిమా, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, లైవ్ షోవ్‌లు నేడు రాజ్యమేలుతున్నాయి. కానీ ఒకప్పుడు నాటక రంగం ప్రజలను కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. దేశంలో ఏ భాషలో లేని పద్య నాటకాలు మన తెలుగులోనే ఉన్నాయి. పౌరాణిక నాటకంలో నటుల హావభావాలు, కంఠస్త పద్యాలు ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. కాలక్రమేణా నాటక రంగం కుదేలైంది. ఆడేవారు లేక, చూసే వారు రాక నిరాదరణకు గురై కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
నటనే శ్వాసగా..
పొదలకూరు పట్టణంలో 1976లో అభ్యుదయ కళా సమితిని స్థాపించారు. ఇందులో ఎందరో నటులు సాంఘిక నాటకాలను ఆడి పేరు సంపాదించారు. ఆ నాటకాలను చూసేందుకు సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు పొదలకూరుకు వచ్చేవారు. కాలక్రమంలో నటులు కాలం చేయడం, ఉన్న వారు వృద్ధాప్యంతో నాటకాలు ఆడలేకపోవడంతో సమితి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి వచ్చిన వారిలో ఒకరు బాబూరావు. పౌరాణిక నాటకాల్లో ఆయను మంచి పేరుంది. సుమారు 1,500 పైగా నాటకాలాడారు. బిరదవోలు గ్రామానికి చెందిన గాది సుధాకర్‌బాబు(బాబూరావు) తన నటాభిలాషను పాఠశాల స్థాయి నుంచే పెంచుకున్నారు. 1984లో శ్రీనివాసులు అనే గురువు వద్ద సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడి పాత్ర ద్వారా పరిచయమయ్యారు. అప్పటి నుంచి అభినవ నక్షత్రకునిగా పేరు తెచ్చుకున్నారు. కళా సమితి బి.సంజీవరావు, వీవీ రమణయ్య యాదవ్ ట్రూపులో చేరి నాటకాలాడేవారు. అభినవ గోపాలరావు అనే బిరుదును కూడా నక్షత్రకుని పాత్ర ద్వారా సొంతం చేసుకున్నారు. బాలనాగమ్మలో బాలవ ర్ధిగా, గయోపాక్యానం యుద్ధ సీనులో శ్రీకృష్ణుడిగా, చింతామణి నాటకంలో భవానీశంకర్ పాత్రలను పోషించారు.
ఆదరణ లేక..
నాటక రంగానికి ఆదరణ తగ్గిపోవడంతో నటులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లారు. బాబూరావు పౌరోహిత్యం చేసుకుంటున్నారు. కళారంగానికి ఆయన ఎంత సేవ చేసినా చివరకు జీవనం కష్టంగా మారడంతో తన సొంత గ్రామంలో దేవాలయాల అర్చకుడిగా కాలం వెళ్లదీస్తున్నారు. సాంఘిక నాటక రంగంలో దిగ్గజంగా పేరున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కె.కోటేశ్వరరావు వ్యవసాయం వైపు దృష్టి సారించారు. పొదలకూరులో అభ్యుదయ కళా సమితికి చెందిన కోటేశ్వరరావు, బాబూరావుతోపాటు వ్యవస్థాపకులు బొల్లినేని గోపాలకృష్ణయ్య, వీవీ రమణయ్య యాదవ్, చిల్లర సుబ్బారావు, చిట్టేటి మీరయ్య, కై తేపల్లి రమణయ్య, సింగ్ తదితరులు ఉండేవారు.
కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. పౌరాణిక, సాంఘిక నాటకాలకు ఆదరణ తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్ల యుగంలో ఉన్న ఇప్పటి పిల్లలకు వాటి గురించి పెద్దగా తెలియదు. గతంలో పల్లెవాసులు నాటకాలను తిలకించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లేవారు. నటులకు అరుదైన గౌరవ మర్యాదలు దక్కేవి. కళాకారులకు వీక్షకుల చప్పట్లే కొండంత బలం. అయితే అది ప్రస్తుతం లేకుండాపోయింది.
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
రంగస్థల వెలుగులు మాయం
రంగస్థల వెలుగులు మాయం
రంగస్థల వెలుగులు మాయం
రంగస్థల వెలుగులు మాయం
రంగస్థల వెలుగులు మాయం