
చంద్రబాబు చరిత్రహీనుడు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలికి చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయారని మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును ఆమోదం తెలిపేందుకు చంద్రబాబు పూర్తి సహకారాన్ని అందించి ముస్లింల పట్ల తన వ్యతిరేక వైఖరిని చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేనకు ప్రజలు తగిన గుణపాళం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
● వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హంజా హుస్సేనీ మాట్లాడుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ చట్ట బిల్లును ప్రవేశపెట్టారన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు మతతత్వ పార్టీలుగా తమ వైఖరిని బహిర్గతం చేశాయన్నారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం చేయడం కోసం నల్ల చట్టాన్ని ప్రవేశపెట్టి ముస్లింలను దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ముస్లింలకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. బిల్లును వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆగదని, దేనికైనా సిద్ధమని ప్రకటించారు.
● మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ సిద్ధిఖ్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీపై మీద బురద చల్లాలని సోషల్ మీడియా ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం మొదలు పెట్టిందన్నారు. ఎల్లో పత్రికల్లో కథనాలు రాయించి ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
● మైనార్టీ నాయకులు సత్తార్, సయ్యాద్ అలీం, అబ్దుల్ రజాక్, షేక్ సలీం మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నిత్యం గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోవడం ఘోరమన్నారు. ఆయన తన నిజస్వరూపాన్ని బయట పెట్టారని తెలిపారు. ఏకకంఠంతో ముస్లింలు వ్యతిరేకిస్తున్నా బిల్లుకు మద్దతు తెలిపి సవరణలు సూచించామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్ కరిముల్లా, నేతలు మున్వర్, షాకీర్, షేక్ మీరా, షేక్ హంషీద్ అలీ, రవూఫ్, జాకీర్, అబ్దుల్ రజాక్, గయాజ్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు
ముస్లిం సమాజం వ్యతిరేకం
మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్