
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళుర్పించారు. కలెక్టర్ మాట్లా డుతూ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడి బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన గొప్ప సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌రామ్ అని అన్నారు. జిల్లాలో 30 శాతం ఎస్సీ, ఎస్టీల జనాభా ఉందని, వీరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ మహనీయుల చరిత్ర తెలుసుకోవడంతోపాటు వారి స్ఫూర్తితో చరిత్రలో తమకు ఒక ప్రత్యేక స్థానం సాధించాలనే పట్టుదల, కార్యదక్షత విద్యార్థులు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం చదువు, ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ సమాజహితం కోసం పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని పలు సంఘాల నాయకులను కోరారు. ఈ చట్టం ఎటువంటి రక్షణ కల్పిస్తుందో వివరించాలన్నారు. తొలుత పలు సంఘాల నాయకులు బాబూ జగ్జీవన్‌రామ్ జీవిత విశేషాలు, రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు, దేశానికి బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఉదభాస్కర్‌రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, విద్యార్థినిలు, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.