బండారు శ్రావణిని పక్కన పెట్టిన టీడీపీ! | - | Sakshi
Sakshi News home page

బండారు శ్రావణిని పక్కన పెట్టిన టీడీపీ!

Published Fri, Nov 17 2023 12:44 AM | Last Updated on Sat, Nov 18 2023 9:09 AM

- - Sakshi

అధికారంలో ఉన్నప్పుడే కాదు.. విపక్షంలోనూ బడుగు, బలహీన వర్గాల పట్ల చంద్రబాబు చిన్న చూపు ప్రదర్శిస్తున్నారు. అగ్ర కులాల వారే పెత్తనం చెలాయించేలా చూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో బంతాట ఆడుతూ అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. టీడీపీ పెత్తందార్ల పార్టీనే అని నిరూపిస్తున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. చంద్రబాబు, చినబాబు లోకేష్‌ల ద్వంద్వ వైఖరిని చెప్పకనే చెప్పేస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమని ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. చెప్పినట్లుగానే పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. పార్టీని క్రమంగా పెత్తందార్లకు అడ్డాగా మార్చారు. టీడీపీలో రాజకీయంగా ఎదగాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆత్మాభిమానం చంపుకోలేక ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు.

శింగనమలలో దారుణంగా..
ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు స్థానాల్లోనూ టీడీపీకి చెందిన అగ్రకులాల నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థి పరిస్థితి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేత బండారు శ్రావణిని ఇక్కడ డమ్మీగా మార్చారు. టూమెన్‌ కమిటీ పేరుతో ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసనాయుడును నియమించి అవమానించారు. వీళ్లు చెప్పినట్టే అక్కడ పనులు జరగుతున్నాయి. ఇటీవల శ్రావణి తండ్రిపై దాడి జరిగింది. ఆ సమయంలో ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా లోకేష్‌ జిల్లాలోనే ఉన్నారు. దాడికి పాల్పడిన వారిని మందలించనూ లేదు. దెబ్బలు తిన్న వ్యక్తిని పరామర్శించనూ లేదు.

గుండుమల.. ఎస్సీ నేతల విలవిల
మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ మైనింగ్‌ మాఫియాకు అధిపతిగా చెప్పుకునే గుండుమల తిప్పేస్వామిదే పెత్తనం. ఆయన నియంత వైఖరిని జీర్ణించుకోలేని ఈరన్న వర్గానికి చెందిన ఎస్సీ నాయకులు పార్టీకి ఆమడదూరం వెళ్లిపోయారు. డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని, ఎస్సీలను పట్టించుకునే నాథుడే లేరని ఉన్న కొద్దిపాటి ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే పలు సామాజిక వర్గాల నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడ పార్టీకి పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదన్న సర్వేలు అధిష్టానానికి వెళ్లినట్లు తెలిసింది.

మైనార్టీ మాట చెల్లని రూక..
2014లో జరిగిన ఎన్నికల్లో కదిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున అత్తార్‌ చాంద్‌బాషా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడాయన మాట చెల్లని రూక అయింది. డీడీల కుంభకోణంలో శిక్ష పడిన కందికుంట ప్రసాద్‌ మాటే పైచేయిగా మారింది. నేరాలకు తెగబడుతున్నా కందికుంటనే చంద్రబాబు, లోకేష్‌ ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతో ఇక్కడ మైనార్టీలు తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు.

అంతటా అంతే..
ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకుల మాట చెల్లడం లేదు. అధికారంలో ఉన్నప్పుడూ.. ఇప్పుడూ అగ్రకులాల వారు పెత్తనం చెలాయిస్తుండడంతో రగిలిపోతున్నారు. ఇక.. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని సామాజిక వర్గాలకు సముచితం స్థానం కల్పించారు. పెద్ద ఎత్తున రాజకీయంగానూ పదవులు కట్టబెట్టారు. చెప్పాడంటే.. చేస్తాడంటే అనేంతలా పేరు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల మనసులనూ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీలోని బడుగు బలహీన వర్గాల నాయకులు ఇప్పటికే పలు చోట్ల అధికార పార్టీలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల తాకిడి మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. టీడీపీకి బడుగు బలహీన వర్గాల నేతలు గట్టి షాక్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement