పైడేటి రమణ కన్నుమూత
పరిగి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విశేష సేవలందించిన ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, పెనుకొండ మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ పైడేటి డీవి రమణ(55) ఇక లేరు. వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. తనదైన సేవలతో పాటూ వ్యక్తిగత ఇమేజ్ కారణంగా పెనుకొండ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి ఆయన సుపరిచితులయ్యారు. వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న ఆయనను తొలుత హిందూపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమిస్తుండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వరకూ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నా... ఆ తర్వాత రెండు సార్లు గుండెపోటుకు గురయ్యారు. ఈ క్రమంలో జ్వర తీవ్రత మెదడుకు చేరడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మధ్యాహ్నం మృతి చెందారు. విషయం తెలియగానే జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆగమేఘాలపై బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి చేరుకుని రమణ మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను, బంధువులను పరామర్శించారు. కాగా, రమణ మృతిపై మండల ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment