బీసీ హాస్టల్‌లో ఆకలి కేకలు
● రిపబ్లిక్‌డే రోజున వంట చేయని వైనం
● వసతిగృహం అధికారిపై కలెక్టర్ సీరియస్
● ఆర్డీఓ వెళ్లాక హుటాహుటిన వంట
చెన్నేకొత్తపల్లి: బీసీ వసతిగృహంలో ఆకలి కేకలు మిన్నంటాయి. గణతంత్ర దినోత్సవం రోజున వంట చేయకుండా విద్యార్థులను పస్తులుంచారు. వసతిగృహం అధికారి నిర్లక్ష్యంపై కలెక్టర్ చేతన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే.. చెన్నేకొత్తపల్లిలోని బీసీ వసతిగృహంలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు ఆదివారం ఉదయాన్నే తమ పాఠశాలలకు వెళ్లి రిపబ్లిక్‌డేలో పాల్గొన్నారు. వేడుకలు ముగిసిన అనంతరం హాస్టల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం అవుతున్నా వంట చేయలేదు. ఆకలికి తట్టుకోలేకపోయిన కొందరు విద్యార్థు తమవద్ద ఉన్న పాకెట్ మనీతో సమీపంలోని హోటల్‌కు వెళ్లి తిన్నారు. మరికొందరు పార్సిల్స్ తీసుకొచ్చి తోటి విద్యార్థులతో కలిసి తలా రెండు ముద్దలు తిని సరిపెట్టుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కలెక్టర్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. హాస్టల్‌ను తనిఖీ చేసి నివేదిక పంపాలని ధర్మవరం ఆర్డీఓ మహేష్‌ను ఆదేశించారు. హుటాహుటిన ఆర్డీఓ చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ సురేష్‌కుమార్‌తో కలసి వసతిగృహాన్ని సందర్శించారు. ఆ సమయంలో వసతి గృహం అధికారి లేరు. ఆకలికి నకనకలాడుతున్న విద్యార్థులను చూసి ఆర్డీఓ చలించిపోయారు. తక్షణమే భోజనం తయారు చేసి విద్యార్థులకు పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటికప్పుడు వంట తయారు చేసి వడ్డించారు. ఈ సందర్భంగా వసతిగృహంలో తాగునీరు లేదని, మరుగుదొడ్లు సరిగా లేవని, గదుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో దోమలతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్డీఓ విలేకరులతో మాట్లాడుతూ హాస్టల్‌లో విచారణ చేసి, తయారు చేసిన నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని చెప్పారు.
30న జాబ్ మేళా
మడకశిర: ఈ నెల 30వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మడకశిరలోని ఎస్‌వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జాబ్‌మేళాలో మూడు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ చేసి, 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలిగిన యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికై న వారు పెనుకొండ, హిందూపురం, అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుందని, రూ.12 వేల నుంచి రూ.20వేల వరకు వేతనం ఇస్తారని వివరించారు. విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఫొటో, ఆధార్ కార్డు, బయోడేతో జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మంగళమడక గ్రామానికి చెందిన సాకే హరి (27) ప్రైవేట్ సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ముదిగుబ్బ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. మార్గం మధ్యలోని రామస్వామి తండా సమీపంలో రోడ్డుపై ఉన్న రాళ్లకుప్ప కనిపించపోవడంతో బైక్ అదుపు తప్పడంతో హరి ఎగిరి కిందపడి దొర్లుతూ సమీపంలోని గుంతలో పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో గుర్తించలేకపోయారు. తర్వాత కొంతసేపటికి రోడ్డు పక్కన ద్విచక్రవాహనం పడి ఉండడం గమనించిన వాహనదారులు వెదుక్కుంటూ వెళ్లగా గుంతలో హరి కనిపించాడు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. హరికి భార్య లత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment