జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుదామని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. పారదర్శకత, సమష్టి కృషితో పనిచేసి అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించి జిల్లాను అభివృద్ధి పథంలో నిలపాలన్నారు. పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రామ్ వద్ద ఉన్న పోలీసు పరేడ్ మైదానంలో 76వ గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ రూపకల్పన కోసం కృషి చేసిన మహనీయులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికలను కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం–2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత ఇసుక సరఫరా, అన్న క్యాంటీన్ ద్వారా తక్కువ ధరకే భోజనం వంటివి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు.రాబోవు రోజుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ వి.రత్న, డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment