రైతు కూలీల సంక్షేమంపై దృష్టి సారించని ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

రైతు కూలీల సంక్షేమంపై దృష్టి సారించని ప్రభుత్వాలు

Published Wed, Jan 29 2025 12:56 AM | Last Updated on Wed, Jan 29 2025 12:55 AM

రైతు కూలీల సంక్షేమంపై దృష్టి సారించని ప్రభుత్వాలు

రైతు కూలీల సంక్షేమంపై దృష్టి సారించని ప్రభుత్వాలు

అనంతపురం: స్వాతంత్య్రానంతరం దేశంలో రైతు కూలీల సంక్షేమంపై ఏ ప్రభుత్వమూ దృష్టి సారించలేదని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణా రావు అన్నారు. ‘భూమి లేని వ్యవసాయ కూలీల సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకం’ అంశంపై గ్రామీణాభివృద్ధి, సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వేదికగా మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పనికి తగ్గ కూలి లభిస్తే కుటుంబపోషణకు దోహదపడుతుందన్నారు. కొన్ని సామాజిక వర్గాలు జ్ఞానంతో వృద్ధి చెందారన్నారు. ప్లాస్టిక్‌ కారణంగా కొన్ని కులవృత్తుల (కుమ్మరి) ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైపుణ్యం లేని వారే చివరకు రైతు కూలీలుగా మిగిలిపోతున్నారన్నారు. రెక్టార్‌ ప్రొఫెసర్‌ జి. వెంకటనాయుడు మాట్లాడుతూ.. దేశంలో 41.63 శాతం మంది ఎలాంటి జీవనాధారం లేని కూలీలు ఉన్నారని తెలిపారు. 60 ఏళ్లు దాటిన రైతు కూలీలకు శ్రమయోజన కార్డులు అందించాలన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, విత్తనాల ధరలు పెరగడం, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు రైతు కూలీలకు మధ్య సత్సంబంధాలు అవసరమన్నారు. గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి ప్రొఫెసర్‌ మునినారాయణప్ప అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అసిస్టెంట్‌ డైరెక్టర్లు డాక్టర్‌ కె.వెంకటరెడ్డి, డాక్టర్‌ డి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement