అభ్యర్థుల ప్రకటనపై టీడీపీలో ఆగ్రహ జ్వాల | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ప్రకటనపై టీడీపీలో ఆగ్రహ జ్వాల

Published Sat, Mar 23 2024 12:35 AM | Last Updated on Sat, Mar 23 2024 12:24 PM

- - Sakshi

శ్రీకాకుళం, పాతపట్నంలో తిరుగుబాటు

చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్న, రామ్మోహన్‌ ఫ్లెక్సీలను తగలబెట్టిన తెలుగు తమ్ముళ్లు

శ్రీకాకుళంలో స్వతంత్య్రంగా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి ప్రకటన

కలమటకు మద్దతుగా పాతపట్నంలో మూకుమ్మడి రాజీనామాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీలో సీటు కుంపటి అంటుకుంది. అభ్యర్థుల ప్రకటనతో రాజుకున్న నిప్పు ఆ పార్టీ జెండాల కాల్చివేత వరకు వెళ్లింది. టీడీపీ మూడో జాబితా ప్రకటన శ్రీకాకుళం, పాతపట్నం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణలను కాదని కోట్లు ముట్టచెప్పినవారికి టిక్కెట్లు ఇచ్చారంటూ టీడీపీలోని సీనియర్‌ కేడర్‌ రగిలిపోయింది. టిక్కెట్లను అమ్ముకుని పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినోళ్లకి మొండి చేయి చూపారని కార్యకర్తలు మండిపడ్డారు. టీడీపీకి చెందిన కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్రా మెటీరియల్‌ను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన మంటలు రేగాయి. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి అన్యాయం జరిగిందని వారి అనుచరులు, కలమటను మోసం చేశారని ఆయన వర్గీయులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. త్వరలోనే తమ కార్యాచరణ తెలియజేస్తామని శ్రీకాకుళం నిరసనకారులు ప్రకటించగా, ప్రకటన చేయడమే తరువాయి కలమట అనుచరులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

శ్రీకాకుళంలో నిరసన జ్వాల..
తెలుగుదేశం పార్టీ వద్దు.. సైకిల్‌ గుర్తు అసలొద్దు.. టీడీపీ జెండాలు.. చంద్రబాబు అజెండా మనకొద్దు అంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో సీనియర్‌ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆమెకు సీటు రాకుండా అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఒంటి కాలితో లేచారు. గుండ లక్ష్మీదేవిని కాకుండా ఏ మాత్రం పట్టులేని గొండు శంకర్‌కు టిక్కెట్‌ ఇచ్చి, సీనియర్లకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. అధికార పక్షం టిక్కెట్లు అమ్ముకుంటుందని ఆరోపణలు చేసిన చంద్రబాబు చేసిందేంటని, ఆ కోట్లు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చారని, వైఎస్సార్‌సీపీ సామాన్యులకు టిక్కెట్‌ ఇచ్చి మన్ననలు పొందుతోందని, టిక్కెట్లను అంగడి సరుకులా పెట్టి టీడీపీ ఏకంగా అమ్ముడుపోయిందని ఆగ్రహంతో రగిలిపోయారు.

టిక్కెట్‌ ప్రకటించగానే గుండ లక్ష్మీదేవి అనుచరులంతా ఆమె నివాసం వద్దకు చేరుకుని రచ్చరచ్చ చేశారు. గుండ లక్ష్మీదేవికి టిక్కెట్‌ లేదని తేలిపోవడంతో వారి అనుచరులంతా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పార్టీ జెండాలు, ఆరు గ్యారంటీ కరపత్రాలను మంటల్లో వేశారు. చంద్రబాబు, లోకేష్‌ ఫొటోలను ధ్వంసం చేసి తగలెట్టారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్‌నాయుడిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గుండ ఫ్యామిలీపై అనుచరులంతా ఒత్తిడి చేశారు. తాము చెప్పిన మేరకు నడుచుకోవాలని, కాదూ కూడదంటే తమదారి తాము చూసుకుంటామే తప్ప గొండు శంకర్‌కు పనిచేసేది లేదని తెగేసి చెప్పేశారు. దీనిపై కార్యకర్తలందరితో సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటానని గుండ ఫ్యామిలీ చెప్పడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: గుండ లక్ష్మీదేవి
శ్రీకాకుళం : శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా తాను బరిలో ఉంటానని మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి చెప్పారు. శుక్రవారం సాయంత్రం కొందరు అనుయాయులతో సమావేశమైన అనంతరం ఆమె మాట్లాడుతూ తన అనుయాయుల అభీష్టం మేరకు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా ఆమెను పార్టీకి రాజీనామా చేయాలని, లేదంటే వైఎస్సార్‌సీపీలో చేరాలని కోరారు. అదీ కుదరదంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉండాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వారు ఒప్పుకున్నారు. అప్పలసూర్యనారాయణ కూడా ఇండిపెండెంట్‌గా ఎంపీగా బరిలోకి దిగాలని కార్యకర్తలు కోరగా ఆదివారం జరిగే సమావేశంలో కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

పాతపట్నంలో మూకుమ్మడి రాజీనామాలు.. 
పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు చంద్రబాబు మొండి చేయి చూపారు. అటు పార్టీకి, ఆటు క్యాడర్‌కు బాగా ఖర్చు పెడుతున్న మామిడి గోవిందరావును ఖరారు చేశారు. దీంతో కలమట అనుచరులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. పార్టీ ఫిరాయించి వస్తే తమకిచ్చే గౌరవం ఇదేనా అని కలమటతో పాటు ఆయన అనుచరులు రగిలిపోయారు. పది కార్లు వేసుకుని, పదిమందిని వెంట బెట్టుకుని, నియోజకవర్గంలో షో చేసిన వారికి టిక్కెట్‌ ఇచ్చారంటూ మండి పడుతున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్‌ చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరులో కలమటకు మద్దతుగా రోడ్డెక్కి టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు.

పార్టీ మండలాధ్యక్షులు సైతం రాజీనామా చేశారు. కోట్లు రూపాయలిచ్చినోడికి టిక్కెట్‌ ఇస్తే పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారి పరిస్థితేంటని, రియల్టర్లకు అమ్ముడుపోయిన పార్టీకి ఎలా పనిచేస్తామని బాహాటంగానే తిట్టిపోశారు. చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు తదితరుల ఫ్లెక్సీలను కూడా మంటల్లో దహనం చేశారు. నిరసన ర్యాలీలు చేసి, కలమట అనుచరులంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. మామిడి గోవిందరావు ఎమ్మెల్యే అభ్యర్థి ఏంటని, తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టికెట్‌ తనకు రాలేదని తెలిశాక కలమట వెంకటరమణ తన కార్యాలయం ముందున్న బ్యానర్లను తొలగించేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆగ్రహంతో చంద్రబాబు ఫొటోఫ్రేమ్‌ అద్దం ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్త 1
1/2

ఆగ్రహంతో చంద్రబాబు ఫొటోఫ్రేమ్‌ అద్దం ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్త

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement