సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబునాయుడుకు మద్దతుగా టీడీపీ అధిష్టానం పిలుపుమేరకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. టీడీపీ కీలక నాయకులు బల్క్‌లో పోస్టు కార్డులు కొనుగోలు చేసి వాటిని నిరసన శిబిరాల వద్ద పెట్టి, ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేత రాయించేసి, వాటినే పోస్టు చేయిస్తున్నారు. జైల్లో క్షేమంగా ఉండాలని కోరుతూ ‘మీతోనే మేము’ పేరుతో పోస్టు కార్డుల ఉద్యమానికి టీడీపీ అధిష్టానం పిలుపు ఇస్తే... నాయకులే ఒకచోట కూర్చొని కట్టలు కట్టల పోస్టుకార్డులు రాసేస్తుండటం చూసి జనమే నవ్వుకుంటున్నారు.
కింద ఫొటో ఒకసారి చూడండి. ఇందులో ఉన్న వ్యక్తి సారవకోట మండల టీడీపీ నేత కత్తిరి వెంకటరమణ. నరసన్నపేట టీడీపీ ఆఫీస్ నుంచి బల్క్‌గానే కార్డులు తీసుకెళ్లి పోస్టు కార్డు ఉద్యమం చేశారు.
నరసన్నపేట టీడీపీ నిరసన శిబిరంలో ముందు వరసలో నాయకులను చూడండి. పోస్టుకార్డుల కట్ట పట్టుకుని ఒకే దఫా రాసేస్తున్నారు. బల్క్‌లో కొనుగోలు చేసి బల్క్‌గానే రాసేశారు.
కళ్లముందు జరుగుతున్న తంతు చూసి ఈ రకమైన పోస్టు కార్డు ఉద్యమం ఎప్పడూ చూడలేదని అంటున్నారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలే స్పందిస్తూ... సెంట్రల్ జైలుకు ఈ కార్డులు రాయాలన్నది పార్టీ ఉద్దేశం. దీని ద్వారా ప్రజాభిప్రాయం తెలియాలన్నది టీడీపీ పబ్లిసిటీ ఎత్తుగడ. అయితే, దీనికి ప్రజల నుంచే కాదు టీడీపీ కార్యకర్తల నుంచి కూడా స్పందన లేకపోవడంతో నాయకులే లీడ్ తీసుకుని పోస్టుకార్డుల ఫేక్ ఉద్యమం చేస్తున్నారు.
కనీస మద్దతు కరువు..
చంద్రబాబు అరెస్టయి జైలుకెళ్లాక తొలుత నిరసన ప్రదర్శనలు అన్నారు. తర్వాత బంద్‌కు పిలుపునిచ్చారు. తదుపరి రిలే నిరాహార దీక్షలకు దిగారు. తర్వాత దేవాలయాల్లో పూజలు అన్నారు. ఇందులో ఏ ఒక్కదానికి జనం నుంచి స్పందన రాలేదు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్న పరిస్థితి లేదు. కనీసం మద్దతిచ్చి సానుభూతి కూడా చూపడం లేదు. చెప్పాలంటే చంద్రబాబు జైలుకెళ్లడాన్ని ప్రజలెవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. అవినీతి చేసినందున అరెస్టయ్యారని అంతా అనుకుంటున్నారు. అక్రమాలు చేసి ఇన్నాళ్లు తప్పించుకున్న చంద్రబాబుకు ఎట్టకేలకు పాపం పండిందని, యువతకు శిక్షణ పేరుతో వందల కోట్లు దోపిడీ చేసినందుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి వస్తుందని ఆశించిన టీడీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయింది.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా..
ప్రజల నుంచి స్పందన లేదని వదిలేస్తే పార్టీ ఉనికికే ప్రమాదమని టీడీపీ అధిష్టానం రకరకాల జిమ్మిక్కులు చేస్తోంది. ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తూనే మరోవైపు పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టాలని కేడర్‌కు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తోంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 5వేల నుంచి 10వేల పోస్టు కార్డులు రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లేలా లక్ష్యాలను నిర్దేశించింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు నాయకత్వాలు వేర్వేరుగా పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టాలని సూచించింది. ఈ లెక్కన జిల్లాలో 60 వేల నుంచి లక్ష వరకు పోస్టు కార్డులను ‘మీతోనే మేము’ అని ప్రజల చేత రాసి పంపించి, ప్రజా మద్దతు చంద్రబాబుకు ఉందని చెప్పడానికి ప్రయత్నించింది.
కాశీబుగ్గ కేసీ రోడ్డులో నిర్వహించిన టీడీపీ శిబిరంలో కొనసాగిన తంతుచూడండి. జేబులో పోస్టుకార్డుల కట్ట పెట్టుకుని, చేతిలో మరో పోస్టు కార్టుల కట్ట పట్టుకుని ఒకే చోట టీడీపీ నాయకులు రాస్తున్న సందర్భమిది.
రెండు వారాలుగా ఈ కార్యక్రమం జరుపుతూనే ఉంది. అయితే, పోస్టుకార్డు ఉద్యమంలో ప్రజలు పాల్గొనడం లేదు. స్వచ్ఛందంగా పోస్టుకార్డులు రాసి పంపించడం లేదు. దీంతో నాయకులే బల్క్ లో పోస్టుకార్డులు కొనుగోలు చేసి వాటిని నిరసన శిబిరాలు, పార్టీ కార్యాలయాలు, ఇళ్లల్లో పెట్టి ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేత రాయిస్తున్నారు. కార్డులన్నింటినీ బల్క్‌గాతీసుకెళ్లి పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నడుస్తున్న ఏ టీడీపీ శిబిరానికి వెళ్లినా ఇదే కనిపిస్తోంది.
మాకెందుకులే..
నిరసనలు, ఆందోళనలకు కేడర్ నుంచి కనీస స్పందన లేదు. కనీసం పెద్దగా శ్రమలేని పోస్టు కార్డు ఉద్యమంలో కూడా కార్యకర్తలు పాల్గొనడం లేదు. దీనికి జిల్లాలో అమ్మకాలు జరిగిన పోస్టు కార్డుల సంఖ్యనే ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. జిల్లాలో ప్రతి నెలా సరాసరి 3వేల కార్డుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు పోస్టు కార్డుల ఉద్యమం జరిగితే లక్షల్లో విక్రయాలు జరగాలి. కానీ, సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 28 వేల కార్డులు మాత్రమే అమ్ముడయ్యాయి. అవి కూడా నియోజకవర్గానికి ఒక నాయకుడు చొప్పున బల్క్‌లో కొనుగోలు చేసినవే.
వాటినే శిబిరాల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద పెట్టి ఇద్దరు ముగ్గురు రాసేస్తున్నారు. గ్రామాల వారీగా అడ్రసుల సేకరణ బాధ్యత ఇద్దరు ముగ్గురికి అప్పగించి వారి ద్వారా పేర్లను తీసుకుని, ఆ పేర్లపై పోస్టు కార్డులు రాసేసి సెంట్రల్ జైల్‌కు పంపిస్తున్నారు. బల్క్‌గా రాసిన పోస్టుకార్డులను చూస్తే దాదాపు ఒకే దస్తూరీ కన్పిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే ప్రజల నుంచే కాకుండా పార్టీ కార్యకర్తలు కూడా పోస్టుకార్డు ఉద్యమంపై ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment