సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కంచాల మోత మోగలేదు. కొవ్వొత్తుల క్రాంతి భ్రాంతిగా మిగిలిపోయింది. పోస్టుకార్డుల ఉద్యమం నడవలేదు. రిలే నిరాహార దీక్షలు సజావుగా సాగడం లేదు. ప్రజల సహకారం లేనిదే ఏ ఉద్యమం ముందుకెళ్లదు. పబ్లిక్‌లో స్పందన లేకపోతే ఎంత చేసినా ప్రయాసే మిగులుతోంది. జిల్లాలో టీడీపీ నేతలకు ఇప్పుడిదే పరిస్థితే ఎదురవుతోంది. కృత్రిమ ఉద్యమాలు, నిరసనలు ఎంత కాలం చేయగలమన్న అభిప్రాయానికి టీడీపీ శ్రేణులొచ్చేశాయి. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహించలేక.. అలాగని వదిలేయలేక టీడీపీ నాయకులు సతమతమవుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబునాయుడు వ్యవహారం టీడీపీ నేతలకు ప్రాణసంకటంగా తయారైంది.
ఆలోచనలు తలకిందులు..
టీడీపీకి ఉన్న వనరులు, వ్యవస్థల్లో ఉన్న వ్యక్తుల నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు ఒక లెక్క కాదని.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో జైలుకెళ్లినా వెంటనే వచ్చేస్తారని.. సాంకేతిక అంశాలతో కేసు కొట్టేస్తారనే అభిప్రాయంతో టీడీపీ నాయకులంతా తొలుత ఉండేవారు. ఈ రోజు.. రేపు లేదంటే కొన్ని రోజుల్లోనైనా చంద్రబాబు కేసు వీగిపోతుందని.. ఈ లోపు ప్రజల నుంచి సానుభూతి పొందొచ్చని ఆశించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగినట్టు వాళ్ల ఆలోచనలన్నీ తలకిందులైపోయాయి. రోజు లు గడుస్తున్నా టీడీపీ నేతలు అనుకున్నది జరగడం లేదు.
రోజులు.. వారాలు.. నెల గడిచిపోతున్నా వారి ఆశలు నెరవేరలేదు. ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగానే చంద్రబాబు పరిస్థితి తయారైంది. దేశంలో అత్యున్నత న్యాయవాదులు మూకుమ్మడి గా వచ్చి వాదిస్తున్నా కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా సానుకూల తీర్పులు రావడం లేదు. కేసు కొట్టేస్తారనే స్థాయి నుంచి బెయిలైనా వస్తుందనే స్థాయి కి దిగిపోయారు. ఇక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణమనుకుంటే.. దానికి అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్‌వర్క్ స్కామ్.. ఇలా అవినీతి బాగోతాలన్నీ ఒక్కటై వెంటాడటంతో టీడీపీ నాయకులకు దిక్కుతోచని స్థితి ఎదురైంది.
ఆశలు అడియాశలు..
చంద్రబాబు బయటికొచ్చేలోపు పార్టీకి మైలేజ్, సానుభూతి రావాలన్న ఉద్దేశంతో తొలుత నిరసనలు చేపట్టారు. రాస్తారోకోలు నిర్వహించారు. బంద్‌కు పిలుపునిచ్చారు. పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. తర్వాత కంచాల మోత అన్నారు. లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులతో కాంతులు అన్నారు. వీటిలో ఒక్కటీ జిల్లాలో విజయవంతం కాలేదు. అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రజలు సహకరించకపోవడం, మద్దతుగా పాల్గొనకపోవడంతో పేలవంగా సాగాయి. ఎంతసేపూ ఆ పార్టీ ఇన్‌చార్జీలు మరికొంతమందిని సమీకరించి మమ అనిపించడం తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. నయానో బయానో చేసి చివరికీ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అవి కూడా పేలవంగానే జరుగుతున్నాయి. ఉదయం 10, 11 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం భోజన సమయానికి ముగించేస్తున్నారు. ఆ రెండు గంటలు శిబిరంలో కూర్చోబెట్టడానికి చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఎంత ఖర్చు పెట్టినా శిబిరాలు నిండుతున్న పరిస్థితి లేదు.
టీవీల ముందు టీడీపీ శ్రేణులు..
చంద్రబాబు పిటీషన్లు విచారణకు వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులు టీవీలకు అతుక్కుపోతున్నారు. తమ నాయకుడికి ఈ రోజైనా అనుకూల తీర్పు వస్తుందని ఆశతో చూస్తున్నారు. కానీ, కేసులో ఉన్న తీవ్రత, సీఐడీ అధికారులు సమర్పించిన ఆధారాలతో చంద్రబాబుకు ఊరట లభించడం లేదు. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆశతో టీవీలు చూడటం.. తీర్పులొచ్చాక నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు. సోమవారమైతే జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కన్పించింది.
తప్పకుండా చంద్రబాబు అనుకూల తీర్పులొస్తాయని ఉదయం నుంచి టీవీల దగ్గర ఉన్నారు. కానీ, ఒక దాని తర్వాత ఒకటి అంటే హైకోర్టు, ఏసీబీ కోర్టుల ప్రతికూల తీర్పులు రావడంతో భయాందోళనలకు లోనయ్యారు. వాస్తవంగా సోమవారం అనుకూల తీర్పు వస్తే శిబిరాలు ఎత్తేద్దామని భావించారు. ఆ మేరకు కేడర్‌కు సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. కానీ, తమ ఆశలు అడియాసవడంతో మరికొన్ని రోజులు రిలే దీక్షల శిబిరాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏం చేద్దాం..!
చంద్రబాబుకు మద్దతుగా కార్యక్రమాల నిర్వహణలో ప్రజలు సహకరించడం లేదు. కనీస మద్దతు ఇవ్వడం లేదు. దీంతో కార్యకర్తలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. డబ్బులు తీస్తే తప్ప శిబిరాలకు వచ్చే పరిస్థితి లేదు. అతికష్టం మీద కొంతమందిని ప్రతీరోజూ కూర్చోబెడుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ముగించేస్తున్నారు. అయినప్పటికీ ప్రతీరోజూ రిలే శిబిరాలు కొనసాగించడం టీడీపీ నేతలకు కష్టతరంగా మారింది. ఒకవైపు కోర్టుల నుంచి ప్రతికూల తీర్పులు రావడం, క్షేత్రస్థాయిలో స్పందన లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
చంద్రబాబు అవినీతి చేయడంతోనే జైలు కెళ్లారని.. తప్పు చేయకపోతే కోర్టుల్లో న్యాయం జరిగేదని.. బలమైన ఆధారాలతో దొరకడం వల్లే కోర్టుల్లో వ్యతిరేక తీర్పులొస్తున్నాయని.. అవినీతి జరగడం వల్లే కేసు బలపడి పోయిందనే అభిప్రాయానికి కార్యకర్తలు దాదాపు వచ్చేశారు. గతంలో ఎన్నో కేసులొచ్చినా చంద్రబాబు తప్పించుకునేవారని, ఇప్పుడా పరిస్థితి లేకపోవడం వెనక స్కామ్ కేసు స్ట్రాంగ్‌గా ఉందనే ఆలోచనకొచ్చేశారు. దీంతో కార్యకర్తలు నిరసన కార్యక్రమాలకు రావడం లేదు. కేడర్ లేక శిబిరాలు రోజురోజుకూ వెలవెలబోతున్నాయి.
ఏ నియోజకవర్గంలోనైతే రెండు గ్రూపులున్నాయో అక్కడ కొంతమేర నడుస్తున్నాయి. మిగతా అన్నిచోట్ల తుస్సుమంటున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ వర్గాలు, పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు వర్గాలు, ఎచ్చెర్లలో కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు, పలాసలో గౌతు శిరీష, మరో వర్గం ఉండటంతో ఎక్కడ గుర్తింపు కోల్పోతామన్న భయంతో ఉనికిని చాటుకోవడానికి రిలే దీక్షలు కొంతమేర కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment