దారులన్నీ జన సంద్రమే.. ఎటువైపు చూసినా కనుచూపు మేర ‘శంబర’మే. దిక్కులు పిక్కటిల్లేలా అమ్మ శరణు ఘోష ఓ వైపు.. సాక్షీభూతంగా నిలిచిన గోముఖీ నది సవ్వడులు మరోవైపు లయబద్ధంగా సాగుతుంటే.. చల్లని తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. గిరిజనుల కొంగు బంగారం పోలమాంబ 36 అడుగుల సిరిమానుపై ఠీవిగా ఆశీనురాలై, పురవీధుల్లో ఊరేగింది. తన చల్లని చూపుతో భక్తులకు ఆశీర్వచనాలు అందజేసింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించిన భక్తకోటి మురిసిపోయింది. ఆనందంతో పులకించిపోయింది.
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ/సాలూరు:
గిరిజనుల ఆరాధ్య దేవత శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవా రం కనులపండువగా సాగింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరలో కొలువైన పోలమాంబ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సోమ, మంగళవారాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పసుపు కుంకుమలు, చీర లు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ సంబరంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. పూజారి జన్నిపేకాపు రామారావు సిరిమానును అధిరోహించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment