మానసిక వేదన | - | Sakshi
Sakshi News home page

మానసిక వేదన

Published Wed, Jan 29 2025 12:34 AM | Last Updated on Wed, Jan 29 2025 12:34 AM

 మానస

మానసిక వేదన

వీల్‌చైర్లలో వచ్చిన వారు కొందరు.. బంధువుల సాయంతో వచ్చిన వారు మరికొందరు.. కళ్లు కనిపించకపోయినా ఊళ్లు దాటి వచ్చిన వారు ఇంకొందరు.. టీ చుక్క పోసే దిక్కు లేదు. కనీసం మంచినీళ్లు ఇచ్చే నాథుడు లేడు. వైకల్య పరీక్షల కోసం ఆస్పత్రులకు వస్తున్న దివ్యాంగులు నరకయాతన పడుతున్నారు. ‘వైకల్యం ఉంటే సరిపోదు.. దాన్ని రుజువు చేసుకోండి..’ అని ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుండడంతో వీరికి యాతన తప్పడం లేదు. పింఛన్ల భారం దించుకోవడానికి ప్రభుత్వం పరీక్ష పెడుతుంటే.. వైకల్యాన్ని నిరూపించుకోవడానికి దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు.

● వైకల్యాన్ని పునః పరిశీలన చేసుకోవాలని ఆదేశం

● పింఛన్లు ఏరివేసే కుట్రలో మళ్లీ తనిఖీలు

● కొత్తగా పరీక్షల పేరుతో పింఛనుదారులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

● జిల్లాలో 31,800 మందికి తప్పని తిప్పలు

● ఆస్పత్రుల వద్ద నరకయాతన పడుతున్న దివ్యాంగులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కోరి తెచ్చుకున్న కొరివిలా కూటమి ప్రభుత్వం తయారైంది. ఎన్నో ఏళ్లుగా దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్న వారికి మళ్లీ పరీక్షలంటూ ఇబ్బంది పెడుతోంది. పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ‘ఎన్నో ఏళ్లుగా పింఛన్‌ తీసుకుంటున్నాం. ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదు. ఎప్పుడూ చూడలేదు. ఇదేం ఖర్మో మరి. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతోంది’ అని శాపనార్థాలు పెడుతున్నారు. ప్రభుత్వం పెడుతున్న క్షోభకు పింఛనుదారులే కాదు వారి సహాయకులుగా ఆస్పత్రులకు వస్తున్న కుటుంబ సభ్యులు కూడా యాతనపడుతున్నారు. ఎవరో దొడ్డిదారిన పింఛన్లు పొందితే వారిని తొలగించకుండా ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు. కొందరు తమ చంటి బిడ్డలను చంకనేసుకుని సహాయకులతో వచ్చి నరకయాతన అనుభవిస్తున్నారు. కాళ్లు, చేతులు సరిగా లేని వారు, అంధులు, బధిరులు ఆస్పత్రుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించలేక ఆపసోపాలు పడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 31,800 మందికి ఈ తిప్పలు తప్పడం లేదు. మొత్తం 12 బృందాలు పునః పరిశీలన తనిఖీలు చేస్తున్నాయి. విజయనగరం, మన్యం జిల్లాకు చెందిన వైద్య బృందాలు జిల్లాలో పరీక్షలు చేస్తున్నాయి. ఈఎన్‌టీ, మానసిక వికలాంగులు, ఆఫ్తమాలజీకై తే రిమ్స్‌ ఆస్పత్రిలో, ఆర్థోపెడిక్‌ అయితే మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో పునఃపరిశీలన చేస్తున్నారు. మొదట పరీక్షలో అర్హుడైతే ఓకే. ఏ మాత్రం తేడా అనిపించినా మరో టీమ్‌ల చేత పరీక్షలు చేయిస్తారు. అక్కడ అర్హుడైతే మళ్లీ మూడో టీమ్‌ చేత పరీక్షలు చేయిస్తారు. అక్కడ తేడా కొడితే ఇంటికే. ఇదంతా ఒక ఎత్తు అయితే దూరాభారం నుంచి వచ్చిన దివ్యాంగులకు ఆస్పత్రుల్లో కనీసం పట్టించుకోవడం లేదు. కనీసం టీ కూడా ఇవ్వలేదు. కొన్నిచోట్ల నీరు కూడా దొరకని పరిస్థితి. కుర్చీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు.

రూ. 30 నుంచి

పింఛను తీసుకుంటున్నా..

వీల్‌చైర్‌లో కూర్చొన్న వ్యక్తి పేరు తమ్మినేని వైంకుఠం. వీరిది ఆమదాలవలస మండలం కొర్లకోట. ఈయన రూ.30ల నుంచి పింఛను తీసుకుంటున్నారు. పూర్తిగా వినికిడి లోపం ఉంది. ఇప్పుడాయన్ని పునః పరిశీలన చేసుకోమని చెప్పడంతో ఇలా ఆస్పత్రిలో తిప్పలు పడ్డారు.

పదేళ్లుగా తీసుకుంటున్నా..

ఇద్దరు పిల్లలతో తల్లిని చూడండి. ఆమదాలవలస మండలం కొర్లకోట వీరిది. వీరిలో కొడుకు రాజశేఖర్‌కు 20 ఏళ్లుగా పింఛను వస్తుంది. స్వాతమ్మ అనే కుమార్తెకు 16 ఏళ్లుగా పింఛను వస్తోంది. ఈ ఇద్దరు పిల్లలకు వినబడదు, మాట్లాడలేరు. అయినా వెరిఫికేషన్‌ చేసుకోవాలని చెప్పడంతో రిమ్స్‌కు వచ్చారు. ఆ ఇద్దర్ని పిల్లల్ని వెంట పెట్టుకుని ఆస్పత్రుల్లో తిప్పలు పడాల్సి వచ్చింది.

మళ్లీ తనిఖీలు ఎందుకో

చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు డొక్కా ఆదినారాయణ. హిరమండలం చవితి సీధి వీరిది. ఈయనకు పూర్తి గా కళ్లు కనిపించవు. రూ.30ల పింఛన్‌ దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ పునఃపరిశీలన అంటూ ఆ మండల అధికారులు శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ఇక్కడ పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆయనకు తోడుగా భార్య వచ్చారు.

ఈ ముగ్గురూ మానసిక దివ్యాంగులు. వీరిది ఆమదాలవలస మండలం వెంకయ్యపేట గ్రామం. వీరిలో ఒకరు పల్లవి(9), ఇంకొకరు పేరు ప్రభావతి(34), మరొకరు వెంకటేష్‌(38). వీరిలో పల్లవికి తప్ప మిగతా ఇద్దరికీ రూ.200 పింఛను దగ్గరి నుంచి వస్తోంది. పల్లవికి గత కొన్నేళ్లుగా పింఛను వస్తోంది. వీరి ముగ్గురికీ పత్రాలు తెచ్చుకోవాలని అధికారులు చెప్పడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు వచ్చారు. దీంతో వారంతా తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఆస్పత్రుల్లో అవస్థలు పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
 మానసిక వేదన 1
1/4

మానసిక వేదన

 మానసిక వేదన 2
2/4

మానసిక వేదన

 మానసిక వేదన 3
3/4

మానసిక వేదన

 మానసిక వేదన 4
4/4

మానసిక వేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement